Shri Ram Navami: 5 శతాబ్దాల నిరీక్షణ భాగ్యం.. దేశ ప్రజలకు ప్రధాని శ్రీరామనవమి శుభాకాంక్షలు

Shri Ram Navami: శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవమని గుర్తుచేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. 

Updated : 17 Apr 2024 10:53 IST

దిల్లీ: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముని కృప వల్లే ఈ ఏడాది అయోధ్యలో (Ayodhya Ram Mandir) ప్రాణప్రతిష్ఠను చూడగలిగానని వ్యాఖ్యానించారు. మర్యాద పురుషోత్తముడి జీవితం, ఆశయాలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ఆధారాలవుతాయని ఆకాంక్షించారు.

‘‘శ్రీరామ నవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నా హృదయం భావోద్వేగం, కృతజ్ఞతతో నిండిపోయింది. శ్రీరాముని కృప వల్లే నేను ఈ ఏడాది లక్షలాది మందితో కలిసి అయోధ్యలో (Ayodhya Ram Mandir) ప్రాణప్రతిష్ఠను వీక్షించాను. ఆ క్షణాలు ఇప్పటికీ నా మదిలో శక్తిని నింపుతున్నాయి. అయోధ్య దివ్య మందిరంలో మన రామ్‌లల్లా కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి రామనవమి ఇది. ఐదు శతాబ్దాల నిరీక్షణ తర్వాత అక్కడ ఈ ఉత్సవాన్ని నిర్వహించుకునే భాగ్యం లభించింది. ఇది దేశ ప్రజల ఎన్నో సంవత్సరాల కఠిన తపస్సు, త్యాగాల ఫలితం’’ అని మోదీ ఎక్స్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు.

‘‘శ్రీరాముడు భారతీయ ప్రజల హృదయాల్లో ఉన్నాడు. ఆలయ నిర్మాణం కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన అసంఖ్యాక రామభక్తులు, సాధువులు, మహాత్ములను ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మర్యాద పురుషోత్తముడి జీవితం, ఆశయాలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి బలమైన ఆధారం అవుతాయని నా పూర్తి నమ్మకం. ఆయన ఆశీస్సులు స్వయంసమృద్ధ భారత్‌ సంకల్పానికి కొత్త శక్తిని అందిస్తాయని విశ్వసిస్తున్నాను. శ్రీరాముని పాదాలకు ప్రణామాలు’’ అని మోదీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.


అయోధ్యకు పోటెత్తిన భక్తులు

దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. రామాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రాణప్రతిష్ఠ తర్వాత మొదటి శ్రీరామ నవమి కావటంతో భక్తులు అయోధ్యకు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే రామ్‌లల్లాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి. రామమందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించిన శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్టు.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది.

  • బ్రహ్మ మూహూర్తం 3:30 గంటల నుంచే అయోధ్య మందిరంలో క్రతువులు ప్రారంభమయ్యాయి.
  • భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రాత్రి 11 గంటల వరకు ఆలయాన్ని తెరిచి ఉంచనున్నారు. ప్రత్యేక పూజాకార్యక్రమాలను ప్రత్యక్షప్రసారం చేసేలా ఏర్పాట్లు చేశారు. 
  • రామనవమి ఉత్సవాలు, భక్తుల రద్దీ నేపథ్యంలో ఏప్రిల్‌ 19 వరకు వీఐపీలు ఆలయ సందర్శనను రద్దు చేసుకోవాలని తీర్థక్షేత్ర ట్రస్టు విజ్ఞప్తి చేసింది. ఎవరికీ ప్రత్యేక ప్రొటోకాల్‌ ఉండదని.. అందరూ సాధారణ భక్తులతో పాటే క్యూలో నిలబడాలని సూచించింది. స్పెషల్‌ పాసులను కూడా రద్దు చేసింది.
  • ఈ శుభ సందర్భంగా శ్రీరాముడికి సూర్యాభిషేకం, 56 రకాల భోగ ప్రసాదాలతో పాటు అనేక ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
  • ఉదయం 11.58 నుంచి మధ్యాహ్నం 12.03 గంటల వరకు రామ్‌లల్లా నుదిటిపై సూర్యతిలకం కనిపించనుంది. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని