PM Modi: ‘నీ కృషితో స్వీట్‌ రివల్యూషన్‌’.. కశ్మీర్‌ యువకుడికి ప్రధాని మోదీ ప్రశంస

నజిమ్‌ నజీర్‌ అనే కశ్మీర్‌ యువకుడు తన కృషితో స్వీట్‌ రివల్యూషన్‌ తీసుకొచ్చాడని ప్రధాని మోదీ ప్రశంసించారు. 

Updated : 18 Mar 2024 15:32 IST

శ్రీనగర్‌: ఆర్టికల్ 370 (Article 370) రద్దు తర్వాత ప్రధాని మోదీ (PM Modi) తొలిసారి కశ్మీర్‌ (Kashmir)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్వయం ఉపాధి పొందుతున్న స్థానిక యువతతో సంభాషించి, వారి కృషిని అభినందించారు. అనంతరం నజిమ్‌ నజీర్‌ అనే యువకుడితో సెల్ఫీ దిగి ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘ నా స్నేహితుడు నజిమ్‌తో సెల్ఫీ. అతను చేస్తున్న మంచి పనులు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. అతణ్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది. నజిమ్‌ భవిష్యత్తు ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు’’ అని ప్రధాని ట్వీట్ చేశారు. 

అనంతరం నజిమ్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీని కలిసి, ఆయనతో సెల్ఫీ దిగడంతో కల సాకారమైందన్నాడు. పుల్వామా జిల్లాకు చెందిన ఈ యువకుడు.. 2018లో రెండు పెట్టెలతో తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించాడు. అనంతరం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరో 25 పెట్టెలను కొనుగోలు చేసి, మొదటి విడతలో 75 కిలోల తేనె సేకరించి రూ.60 వేలు సంపాదించినట్లు తెలిపాడు. తర్వాత ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకం (PMEGP) ద్వారా రూ.5 లక్షలు రుణం తీసుకుని 200 పెట్టెలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం వాటితో ఐదు వేల కిలోల తేనె సేకరిస్తూ.. వంద మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నాడు. 

‘ఆర్టికల్‌ 370’పై కాంగ్రెస్‌ తప్పుదోవ పట్టిస్తోంది: ప్రధాని మోదీ

ఈ సందర్భంగా నజిమ్‌ కృషిని ప్రధాని ప్రశంసించారు. ‘‘ఇప్పటి వరకు గ్రీన్‌ రివల్యూషన్‌, వైట్ రివల్యూషన్‌ గురించి విన్నాం. కానీ, ఈ యువకుడు స్వీట్‌ రివల్యూషన్‌ను తీసుకొచ్చాడు. మధ్య ఆసియాలో తేనెటీగల పెంపకం కోసం వివిధ పంటలను ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకోవాలి. ఇందుకు ఆన్‌లైన్‌  సమాచారాన్ని విస్తృతంగా అధ్యయనం చేయాలి. దాంతో తేనెలో వివిధ రకాల రుచులను పొందొచ్చు. దేశ యువతకు నువ్వు దిశానిర్దేశం చేస్తున్నావు. దేశానికి మీరే బలం’’ అని మోదీ అన్నారు. అనంతరం ఆయన ఫుడ్‌ టెక్నాలజీ కోర్సు చదివి..  స్థానికంగా బేకరీ నిర్వహిస్తున్న యువతుల బృందాన్ని కలిశారు. 2019లో ప్రభుత్వ సింగిల్‌ విండో విధానం ద్వారా బేకరీ ఏర్పాటుకు అనుమతి పొందినట్లు వారు ప్రధానికి వివరించారు. భవిష్యత్తులో అవసరమైన సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు.

జమ్మూ-కశ్మీర్‌ కేంద్రంగా ‘వెడ్‌ ఇన్‌ ఇండియా’

కశ్మీర్‌ వేదికగా  ‘వెడ్‌ ఇన్‌ ఇండియా’ (Wed In India) నినాదాన్ని ప్రధాని మరోసారి ప్రస్తావించారు. భారతీయులు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం జమ్మూ-కశ్మీర్‌లోని ప్రాంతాలను ఎంచుకోవాలని కోరారు. ‘‘ దేశ ప్రజలు తమ కుటుంబంలో జరిగే వివాహాలను జమ్మూ-కశ్మీర్‌లో నిర్వహించవచ్చు. జీ20 సదస్సును ఇక్కడ ఎలా నిర్వహించామో ప్రపంచమంతా చూసింది. కాబట్టి, దేశ ప్రజలు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం ఇక్కడి రావాలి. అలా పర్యటకం పెరిగి స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి’’ అని ప్రధాని మోదీ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని