PM Modi: ‘70ఏళ్లుగా ఉన్న అలవాటు.. తేలిగ్గా వదులుకోరు’.. కాంగ్రెస్‌పై ‘ఎమోజీల’తో మోదీ పోస్ట్‌ వైరల్‌

PM Modi: హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఘోర ఓటమి నేపథ్యంలో ప్రధాని మోదీ మరోసారి హస్తం పార్టీపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఈ సందర్భంగా ఎమోజీలు ఉపయోగించి ఆయన చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Published : 05 Dec 2023 15:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ఫలితాల (Assembly Election Results)పై భాజపా (BJP), కాంగ్రెస్‌ (Congress) మధ్య సామాజిక మాధ్యమాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ రాష్ట్రాల్లో భాజపా విజయంపై కొందరు కాంగ్రెస్‌ అనుకూలురు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.వీటికి భాజపా నేతలు గట్టిగా బదులిస్తున్నారు. తాజాగా దీనిపై ప్రధాని మోదీ (PM Modi) ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. హస్తం పార్టీపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

‘‘తమ (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) అహంకారం, అబద్ధాలు, నిరాశావాదం, అజ్ఞానంతో వారు బహుశా ఆనందంగానే ఉండి ఉంటారు. కానీ, వారి విభజన సిద్ధాంతంతో మనం జాగ్రత్తగా ఉండాలి. అది 70 ఏళ్లుగా వారికి అలవాటైన పద్ధతి. అంత సులువుగా వదిలిపెట్టలేరు’’ అని మోదీ (PM Modi) ప్రజలను హెచ్చరించారు. కానీ, ఇప్పుడు ప్రజలు మరింత విజ్ఞతతో వ్యవహరిస్తున్నారని, అందువల్ల మున్ముందు మరిన్ని ఘోర పరాభవాలకు వారు (కాంగ్రెస్‌) సిద్ధంగా ఉండాలని ప్రధాని ఎద్దేవా చేశారు.

అయితే, ఈ పోస్ట్‌కు ప్రధాని ‘హెచ్చరిక’ను సూచించే, నవ్వుతున్న ఎమోజీలను జత చేశారు. దీంతో మోదీ పోస్ట్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఓటమిపై అసహనాన్ని పార్లమెంటులో చూపొద్దు

ఇదిలా ఉండగా.. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విపక్షాలకు మోదీ నిన్న కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఓటమి తాలుకూ అసహనాన్ని పార్లమెంట్‌లో చూపించొద్దని హితవు పలికారు. వ్యతిరేకతను వీడితేనే వారిపై ఉన్న ప్రజా దృక్పథం మారుతుందని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని