Parliament: లోక్‌సభలో మరో 49 మందిపై సస్పెన్షన్‌ వేటు..

MPs Suspension in Lok sabha: లోక్‌సభలో మరో 49 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు ఉభయ సభల్లో సస్పెన్షన్‌కు గురైన వారి సంఖ్య 140 దాటింది.

Updated : 19 Dec 2023 13:56 IST

దిల్లీ: లోక్‌సభ (Lok Sabha)లో దుండగుల చొరబాటు ఘటనతో పార్లమెంట్ (Parliament) దద్దరిల్లుతోంది. డిసెంబరు 13 నాటి ఈ భద్రతా వైఫల్యం (Security Breach)పై హోం మంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో ప్రతిపక్షాలపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. మంగళవారం మరో 49 మంది విపక్ష ఎంపీలపై స్పీకర్‌ వేటు వేశారు. ఈ సమావేశాల మొత్తానికి వారిని సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు.

సభాపతి ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. అనంతరం స్పీకర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎంపీలు సుప్రియా సూలే, ఫరూక్‌ అబ్దుల్లా, శశి థరూర్‌, కార్తి చిదంబరం, డింపుల్‌ యాదవ్‌, మనీశ్ తివారీ తదితరులు సస్పెన్షన్‌కు గురైన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ.. ‘‘సభలోకి ప్లకార్డులు తీసుకురావొద్దనే నిబంధన ఉంది. ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో వారు (విపక్షాలనుద్దేశిస్తూ) నిరాశ చెందారు. అందుకే వారు ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడుతున్నారు’’ అని దుయ్యబట్టారు.

భాజపా ప్రభుత్వాన్ని కూలదోయడమే ‘ఇండియా కూటమి’ లక్ష్యం: ప్రధాని మోదీ

మొత్తంగా 141 మందిపై..

కాగా.. లోక్‌సభలో ఇప్పటికే గతవారం 13 మందిని, సోమవారం మరో 33 మందిని సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. తాజా సంఖ్యతో కలిపి ఇప్పటి వరకు లోక్‌సభలో 95 మందిపై వేటు పడినట్లైంది. మరోవైపు రాజ్యసభలో ఇప్పటి వరకు 46 మందిని సస్పెండ్ చేశారు. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు మొత్తం 141 మంది విపక్ష ఎంపీలపై చర్యలు తీసుకున్నట్లైంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 22తో ముగియనున్నాయి.

ఉభయ సభలు వాయిదా..

విపక్షాల ఆందోళన నేపథ్యంలో మంగళవారం కూడా ఉభయ సభలు స్తంభించాయి. భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయడంతో పాటు తమ ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. మరోవైపు, సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు అడిగిన 27 ప్రశ్నలను లోక్‌సభ ప్రశ్నల జాబితా నుంచి తొలగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని