PM Modi: భాజపా ప్రభుత్వాన్ని కూలదోయడమే ‘ఇండియా కూటమి’ లక్ష్యం: ప్రధాని మోదీ

కేంద్రంలోని భాజపా ప్రభుత్వాన్ని కూలదోయడమే ఇండియా కూటమి లక్ష్యమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Published : 19 Dec 2023 12:00 IST

దిల్లీ: దేశానికి ఉజ్వల భవిష్యత్తును అందించడమే భాజపా ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కానీ, కేంద్రంలోని తమ ప్రభుత్వాన్ని కూలదోయడాన్నే ఇండియా కూటమి లక్ష్యంగా పెట్టుకుందని ఆయన విమర్శించారు. మంగళవారం దిల్లీలో జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల వ్యవహారశైలిని ఆయన తప్పుపట్టారు. 

‘‘పార్లమెంటులో జరిగిన భద్రతా ఉల్లంఘనను ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాలి. కానీ, ప్రతిపక్షాలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి ప్రవర్తన కారణంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వారి సీట్ల సంఖ్య మరింత తగ్గి, భాజపా అధిక స్థానాల్లో విజయం సాధిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షం తీవ్ర నిరాశకు గురైంది. అందుకే పార్లమెంట్‌ నిర్వహణకు అడ్డుపడుతోంది. దేశానికి ఉజ్వల భవిష్యత్తు అందించాలని భాజపా లక్ష్యంగా పెట్టుకుంటే.. కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోయాలని ‘ఇండియా కూటమి’ లక్ష్యంగా పెట్టుకుంది’’ అని ప్రధాని మోదీ ఎంపీలతో వ్యాఖ్యానించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి మీడియాకు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి భాజపా ఎంపీలకు ప్రధాని కీలక సూచనలు చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు మర్యాదపూర్వకంగా స్పందించాలని, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంచాలని ఆయన ఎంపీలకు సూచించారు. పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత ఎంపీలు సరిహద్దు గ్రామాల్లో పర్యటించాలని ప్రధాని కోరినట్లు ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. 

పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయాలని సోమవారం ఉభయ సభల్లో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయనే ఆరోపణలతో లోక్‌సభలో 33 మంది, రాజ్యసభలో 45 మందిని సస్పెండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం భేటీ అయ్యారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి తొలి సమావేశం దిల్లీలో జరగనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని