BJD: ఎన్నికల వేళ.. బీజేడీ టిక్కెట్లకు 10వేలకు పైగా దరఖాస్తులు

సార్వత్రిక ఎన్నికలతో పాటు త్వరలో ఒడిశాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ నుంచి పోటీ చేసేందుకు 10 వేల మందికి పైగా దరఖాస్తు చేస్తున్నారు. 

Updated : 27 Feb 2024 17:56 IST

భువనేశ్వర్‌: త్వరలో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఏకకాలంలో జరిగే ఈ ఎన్నికల్లో బిజూ జనతా దళ్‌ (బీజేడీ) నుంచి పోటీ చేసేందుకు 10 వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో 147 ఎమ్మెల్యేల బలం, 21 ఎంపీ స్థానాలున్నాయి. వేల మంది బీజేడీ టిక్కెట్లను ఆశించడంపై ఆ పార్టీ హర్షం వ్యక్తం చేసింది.

‘‘రానున్న ఎన్నికల్లో ఎంతో మంది నిపుణులతో సహా 10 వేల మందికి పైగా బీజేడీ టిక్కెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఆరోసారి కూడా సీఎంగా నవీన్‌ పట్నాయక్‌ కొనసాగాలని ఒడిశా ప్రజలు కోరుకుంటున్నారు. వారి ఆశీస్సులతో ఎన్నికల్లో పార్టీ భారీ విజయాన్ని సాధిస్తుందని బలంగా నమ్ముతున్నాం’’ అని బీజేడీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి ప్రణబ్‌ ప్రకాశ్‌ దాస్‌ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

కెనడాలో భారత అధికారులకు బెదిరింపులొచ్చాయ్‌: జైశంకర్‌

2022 పంచాయతీ ఎన్నికల్లో బీజేడీ 52 శాతానికి పైగా ఓట్లను సాధించిందని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తమ పార్టీ నంబర్‌ వన్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదన్నారు. నవీన్‌ పట్నాయక్‌ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంగా మొదటి స్థానంలో నిలిచినట్లు జాతీయ సర్వే నివేదించడమే నిదర్శనమన్నారు.

టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వేల మందిలో.. గెలుపు సామర్థ్యం, పార్టీ పట్ల విధేయత, ఇతర అంశాల ఆధారంగా ఎంపిక చేస్తామని బీజేడీ పేర్కొంది. వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో కాషాయ పార్టీ విమర్శలు గుప్పించింది. ‘‘పరీక్షలు రాసేందుకు వేల మంది వస్తారు. కానీ, ఫలితాల్లో కొందరు మాత్రమే ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ అవుతారు’’ అని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు లేఖశ్రీ సమంతసింగ్‌ ఎద్దేవా చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని