Parliament: ‘భద్రతా వైఫల్యం’పై ఆందోళన.. ఒకే రోజు 78 మంది ఎంపీలపై సస్పెన్షన్‌

Parliament: పార్లమెంట్‌లో సోమవారం ఒక్కరోజే 70 మందికి పైగా విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. భద్రతా వైఫల్యంపై ఆందోళనల నేపథ్యంలో సభాపతులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Updated : 18 Dec 2023 17:24 IST

దిల్లీ: పార్లమెంట్‌ (Parliament)లో గతవారం చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల  నిరసనలతో సోమవారం కూడా లోక్‌సభ, రాజ్యసభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. మరోవైపు, సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నందుకు గానూ సోమవారం ఒక్క రోజే 70 మందికి పైగా విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడటం గమనార్హం. లోక్‌సభ (Lok Sabha)లో 33 మంది, రాజ్యసభ (Rajya Sabha)లో 45 మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ (Congress) సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధరి సహా 33 మందిని సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ నేడు ప్రకటించారు. వీరిలో 30 మందిని ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేయగా.. మరో ముగ్గురిని ప్రివిలేజెస్‌ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ తెలిపారు. ఎంపీలు కె. జయకుమార్‌, విజయ్‌ వసంత్‌, అబ్దుల్‌ ఖలీఖ్‌ స్పీకర్‌ పోడియం వద్ద నినాదాలు చేశారు. వీరి ప్రవర్తనపై ప్రివిలేజెస్‌ కమిటీ నివేదిక ఇవ్వనుంది.

మరోవైపు శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌కు గురైన వారిలో కాంగ్రెస్‌ సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధరీ, ఆ పార్టీ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌, డీఎంకే ఎంపీలు ఎ.రాజా, టీఆర్‌ బాలు, దయానిధి మారన్‌, టీఎంసీ ఎంపీలు సౌగతా రాయ్‌, కల్యాణ్‌ బెనర్జీ, కకోలి ఘోష్‌, శతాబ్ది రాయ్‌ తదితరులు ఉన్నారు. సభాపతి ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. అనంతరం స్పీకర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించారు.

లోక్‌సభలో అలజడి ఘటన.. ఆరు రాష్ట్రాలకు దర్యాప్తు బృందాలు

కాగా.. లోక్‌సభలో ఇప్పటికే 13 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడిన విషయం తెలిసిందే. గత గురువారం వారిపై వేటు వేశారు. దీంతో ఈ సమావేశాల్లో ఇప్పటివరకు మొత్తం 46 మందిని లోక్‌సభ నుంచి సస్పెండ్‌ చేసినట్లయింది.

రాజ్యసభలో 45 మందిపై వేటు

అటు రాజ్యసభలో 45 మంది ఎంపీలను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్‌ ఎంపీలు జైరాం రమేశ్‌, రణ్‌దీప్‌ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌ సహా పలు పార్టీల విపక్ష నేతలపై ఈ వేటు పడింది. వీరిలో 34 మందిని ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేయగా.. మరో 11 మందిని ప్రివిలేజెస్‌ కమిటీ నివేదిక అందే వరకు సస్పెండ్‌ చేస్తున్నట్లు ఛైర్మన్‌ వెల్లడించారు. కాగా.. ఇప్పటికే రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓబ్రియెన్‌పై ఈ శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో నేటి సస్పెన్షన్‌తో కలిపి ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటివరకు మొత్తంగా 90 మందికి పైగా విపక్ష ఎంపీలు సస్పెండ్‌ అయ్యారు. 

ఉభయ సభలు రేపటికి వాయిదా..

‘భద్రతా వైఫల్యం’పై ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై కేంద్రం సభలో ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో లోక్‌సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. విపక్షాలు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో ఉభయ సభలను సభాపతులు రేపటికి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని