Security breach in LS: లోక్‌సభలో అలజడి ఘటన.. ఆరు రాష్ట్రాలకు దర్యాప్తు బృందాలు

Security breach in LS: లోక్‌సభలో భద్రతా వైఫల్యం ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఆరు రాష్ట్రాల్లో దర్యాప్తు బృందాలు వివరాలు సేకరిస్తున్నాయి. 

Updated : 18 Dec 2023 12:44 IST

దిల్లీ: లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలో దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగానికి చెందిన బృందాలు (Delhi Police teams) ఆరు రాష్ట్రాలకు వెళ్లాయి. రాజస్థాన్‌, హరియాణా, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్రకు చేరుకున్నాయి. వీటి వెంట నిందితులు కూడా ఉన్నారు.  అంతేగాకుండా మరో 50 బృందాలు దర్యాప్తులో భాగమయ్యాయి. అవి నిందితుల బ్యాంకు ఖాతాల వివరాలు, పూర్వపరాలను సేకరిస్తున్నాయి. (Security breach in LS)

పార్లమెంటులో అలజడి సృష్టించిన ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్‌ ఝా ధ్వంసం చేసిన ఆధారాలను పోలీసులు కనుగొన్నారు. రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో ఫోన్లను అతడు దహనం చేసినట్లు గుర్తించారు. కాలిపోయిన ఫోన్లను ఆదివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ఘటనానంతరం లలిత్‌ దిల్లీ నుంచి రాజస్థాన్‌కు పారిపోయి ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే.

పార్లమెంటు అలజడి తీవ్రమైన అంశం

గతవారం పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతోన్న సమయంలో విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న సాగర్‌ శర్మ, మనోరంజన్‌ లోక్‌సభలో అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అమోల్‌ శిందే, నీలమ్‌ పార్లమెంట్‌ వెలుపల ఆందోళన చేపట్టారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ప్రస్తుతం శీతాకాల సమావేశాలు కొనసాగుతుండటంతో పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ అలజడి వెనక కుట్ర త్వరలోనే బయటపడుతుందని కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్(Giriraj Singh) వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని