Himachal Pradesh Rains: వర్ష బీభత్సంతో రూ.10వేల కోట్ల నష్టం: హిమాచల్‌ సీఎం

Himachal Pradesh Rains: హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా రూ.10వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారు. వరద సంబంధిత ఘటనల్లో ఇప్పటివరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Published : 16 Aug 2023 17:42 IST

శిమ్లా: ఉత్తరాది రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)కు భారీ వర్షాలు (Heavy Rains) పెను నష్టాన్ని మిగిల్చాయి. జులై నెలలో సంభవించిన జల ప్రళయాన్ని మరవకముందే రాష్ట్రంలో మరోసారి భీకర వరదలు సంభవించాయి. ఈ విపత్తు వందల మంది ప్రాణాలను బలితీసుకోగా.. వేల కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి కోలుకునేందుకు తమకు కనీసం ఏడాది సమయం పడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు (Sukhvinder Singh Sukhu) బుధవారం తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ ఏడాది వర్షాకాల సీజన్‌లో భారీ వర్షాలు హిమాచల్‌ను అతలాకుతలం చేశాయి. ఈ వర్షాలు, వరదల (Floods) కారణంగా ఇప్పటివరకు తాము రూ.10వేల కోట్ల ఆస్తి నష్టాన్ని చవిచూశామని సీఎం సుఖ్వీందర్‌ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయని తెలిపారు. గడిచిన మూడు రోజుల్లోనే 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.

‘‘ఇప్పుడు మేం పర్వతమంత సవాల్‌ను ఎదుర్కొంటున్నాం. వర్షాల కారణంగా ధ్వంసమైన రోడ్లు, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలను పునర్నిర్మించేందుకు మరో ఏడాది సమయం పట్టొచ్చు. కానీ మేం వెనుకడుగు వేయట్లేదు. వీలైనంత వేగంగా మౌలిక సదుపాయలను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

విశ్వకర్మ పథకానికి కేబినెట్‌ ఓకే.. వారికి రాయితీపై రుణాలు

కొనసాగుతున్న సహాయక చర్యలు

శిమ్లాలోని సమ్మర్‌ హిల్స్‌లో ఇటీవల ఓ ఆలయంపై కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. వాటి కింద దాదాపు 30 మంది చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మరోవైపు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, భారత వాయుసేన నిరంతరంగా శ్రమిస్తున్నాయి. హెలికాప్టర్ల ద్వారా బాధితులను ఎయిర్‌లిఫ్ట్ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

గత నెలలో హిమాచల్‌లో భీకర వర్షాలు కురిసి నదులు ఉప్పొంగాయి. ఇళ్లు కూలిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. ఆ పరిస్థితుల నుంచి పూర్తిగా తేరుకోకముందే.. గత కొన్ని రోజులుగా మళ్లీ వర్షాలు కురిసి వరదలు సంభవించాయి. ఈ సీజన్‌లో వర్షాలు, వరద సంబంధిత ఘటనల్లో ఇప్పటివరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని