Vishwakarma scheme: విశ్వకర్మ పథకానికి కేబినెట్‌ ఓకే.. వారికి రాయితీపై రుణాలు

కేంద్ర కేబినెట్‌ (Union Cabinet) బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విశ్వకర్మ పథకం (PM Vishwakarma scheme), పీఎం ఈ-బస్‌ సేవ (PM-eBus Sewa) వంటి స్కీమ్‌లను ఆమోదించింది.

Updated : 16 Aug 2023 16:52 IST

దిల్లీ: పంద్రాగస్టు వేళ చారిత్రక ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశ్వకర్మ పథకాన్ని (PM Vishwakarma scheme) ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి కేంద్ర కేబినెట్‌ (Union Cabinet) ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా చేతివృత్తుల వారికి రాయితీపై రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశ అనంతరం అందులో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌, అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు.

‘‘విశ్వకర్మ పథకం (PM Vishwakarma scheme) కింద చేతివృత్తుల వారికి రాయితీపై రుణాలు మంజూరు చేయనున్నాం. గరిష్ఠంగా 5శాతం వడ్డీరేటుతో ఈ రుణాలు పొందొచ్చు. ఇందుకోసం రూ.13వేల కోట్లను కేంద్రం వెచ్చించనుంది’’ అని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. చేతివృత్తులు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారి కోసం ఈ పథకం కింద రెండు శిక్షణ కార్యక్రమాలను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న వారికి రోజుకు రూ.500 ఉపకార వేతనంతో మెరుగైన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ తర్వాత పరికరాల కొనుగోలు కోసం రూ.15వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు.

ఆ తర్వాత వడ్డీపై రాయితీతో తొలుత రూ.లక్ష రుణం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తొలి విడత సద్వినియోగం చేసుకుంటే రెండో విడత కింద రూ.2లక్ష రుణం మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకంతో ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన సంప్రదాయ కళాకారులు, చేనేతకారులు, స్వర్ణకారులు, వడ్రంగులు, రజకులు, క్షురకుల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబరు 17 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

చివరి కక్ష్యలోకి చంద్రయాన్‌-3.. ఇక జాబిల్లిపై అడుగే తరువాయి

హరిత మొబిలిటీకి గ్రీన్‌ సిగ్నల్‌..

పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసేలా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ‘పీఎం ఈ-బస్‌ సేవ (PM-eBus Sewa)’ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 10వేల ఈ-బస్సులు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.

పబ్లిక్‌-ప్రైవేటు భాగస్వామ్యంతో 169 పట్టణాల్లో ఈ బస్సులను నడపనున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. ఇందుకోసం రూ.57,613కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఇందులో రూ.20వేల కోట్లను కేంద్ర ప్రభుత్వమే సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు.

డిజిటల్‌ ఇండియాకు ఆమోదం..

డిజిటల్‌ ఇండియా (Digital India) పథకానికి కేంద్ర మంత్రివర్గం నేడు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.14,903 కోట్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కింద 5.25లక్షల మంది ఐటీ ఉద్యోగులకు నైపుణ్యాలను మెరుగుపర్చనున్నట్లు తెలిపారు. దీంతో పాటు మరో 9 సూపర్‌ కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

ఏడు మల్టీ-ట్రాకింగ్‌ ప్రాజెక్టులకు ఓకే..

దేశంలో రైల్వే లైన్ల విస్తరణ, రైళ్ల రాకపోకలను క్రమబద్ధీకరించడం, రద్దీని తగ్గించడం కోసం ఏడు మల్టీ ట్రాకింగ్‌ ప్రాజెక్టులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.32,500కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించనుంది. వీటి కింద ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని 35 జిల్లాల పరిధిలో ప్రస్తుతమున్న రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు