Raghav Chadha: ‘సైగలెందుకు.. నోటితో చెప్పండి’: రాఘవ్‌ చడ్డాకు ధన్‌ఖడ్‌ వార్నింగ్‌

Raghav Chadha: రాజ్యసభలో ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చడ్డా ప్రవర్తనపై ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఓ సారి రాజ్యసభ చడ్డాను శిక్షించిన విషయాన్ని గుర్తు చేసి హెచ్చరించారు. అసలేం జరిగిందంటే..

Updated : 15 Dec 2023 17:54 IST

దిల్లీ: లోక్‌సభలో ఇటీవల చోటుచేసుకున్న తీవ్ర అలజడి ఘటనపై పార్లమెంట్ (Parliament) ఉభయ సభలు శుక్రవారం దద్దరిల్లాయి. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం (Security Breach)పై చర్చించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయడంతో రాజ్యసభ (Rajya Sabha)లో ఒకింత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆందోళన సమయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చడ్డా (Raghav Chadha) వ్యవహరించిన తీరు పట్ల ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్ (Chairman Jagdeep Dhankhar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళన చేపట్టాయి. సభా కార్యకలాపాలను రద్దు చేసి డిసెంబరు 13 నాటి ‘భద్రతా వైఫల్యం’ ఘటనపై చర్చించాలని ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. అయితే, ఇందుకు ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌ తిరస్కరించారు. సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని సూచించారు. అదే సమయంలో ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చడ్డా (Raghav Chadha).. పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ను లేవనెత్తేందుకు చేతులతో సంజ్ఞ చేశారు.

దీంతో ఛైర్మన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘చడ్డా.. పాయింట్ ఆఫ్‌ ఆర్డర్‌ను లేవనెత్తేందుకు అలా చేతులతో సైగలు చేయాల్సిన అవసరం లేదు. మీరేదైనా అడగాలనుకుంటే నోటితో అడగండి. మీరు ఇంకా చాలా నేర్చుకోవాలి. వెళ్లి మీ సీట్లో కూర్చోండి. ఇప్పటికే ఓ సారి ఈ సభ మిమ్మల్ని శిక్షించింది’’ అని ధన్‌ఖడ్‌ (Chairman Jagdeep Dhankhar) ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ప్లాన్‌-బి’ రచించి.. ఆధారాలను తగలబెట్టి..! లోక్‌సభలో అలజడి ఘటనలో కీలక విషయాలు

ఈ ఏడాది వర్షాకాల సమావేశాల సమయంలో చడ్డాపై సస్పెన్షన్‌ వేటు పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనపై వచ్చిన ఆరోపణలపై రాజ్యసభ హక్కుల కమిటీ విచారణ జరిపింది. తప్పుదోవ పట్టించే విషయాలను మీడియాకు అందించడం, ప్రతిపాదిత సెలెక్ట్‌ కమిటీకి సభ్యుల అంగీకారం లేకుండానే వారిపేర్లను జాబితాలో చూపించిన అంశాల్లో రాఘవ్‌ చడ్డాను కమిటీ దోషిగా తేల్చింది. అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి శిక్షగా ఆయనకు విధించిన సస్పెన్షన్‌ సరిపోయినట్లు భావించి చడ్డాపై సస్పెన్షన్‌ను రాజ్యసభ ఎత్తివేసింది.

ఉభయ సభలు వాయిదా..

ఇదిలా ఉండగా.. ‘భద్రతా వైఫల్యం’ ఘటనపై ఆందోళనలతో ఉభయ సభలు శుక్రవారం స్తంభించాయి. విపక్షాల ఆందోళనలతో తొలుత రాజ్యసభ, లోక్‌సభ రెండింటిని మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సభలు ప్రారంభమైనా ప్రతిపక్షాలు వెనక్కి తగ్గలేదు. దీంతో ఉభయ సభలు వచ్చే సోమవారానికి (డిసెంబరు 18) వాయిదా పడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని