Parliament: ‘ప్లాన్‌-బి’ రచించి.. ఆధారాలను తగలబెట్టి..!

పార్లమెంటు అలజడిలో పాల్గొన్న వారితో సంబంధమున్న రాజస్థాన్‌కు చెందిన మహేశ్‌, కైలాశ్‌ అనే మరో ఇద్దరు అనుమానితులను దిల్లీ పోలీసు (Delhi Police) విభాగానికి చెందిన స్పెషల్‌ సెల్‌ అరెస్టు చేసింది.

Updated : 15 Dec 2023 14:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పార్లమెంటులో అలజడికి (Parliament Security breach) సంబంధించి ఇప్పటికే ఐదుగురు అరెస్టు కాగా.. కీలక నిందితుడిగా భావిస్తోన్న లలిత్‌ ఝా కూడా గురువారం రాత్రి పోలీసుల ముందు లొంగిపోయాడు. ఇదే సమయంలో వీరితో సంబంధమున్న రాజస్థాన్‌కు చెందిన మహేశ్‌, కైలాశ్‌ అనే మరో ఇద్దరు అనుమానితులను దిల్లీ పోలీసు (Delhi Police) విభాగానికి చెందిన స్పెషల్‌ సెల్‌ అరెస్టు చేసింది. లలిత్‌ ఝా (Lalit Jha)తోపాటు ఈ ఇద్దర్నీ వేర్వేరుగా విచారించిన పోలీసులకు ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. పార్లమెంటులో అలజడి సృష్టించేందుకు తమ పన్నిన అసలు ప్లాన్ విఫలమైతే.. ప్రత్యామ్నాయ ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నట్లు వెల్లడైంది. అంతేకాకుండా ఆధారాలను నాశనం చేసేందుకు నలుగురు నిందితుల మొబైల్‌ ఫోన్లను లలిత్ ఝా దహనం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

‘ప్లాన్‌-బి’ కూడా..

ఒరిజినల్‌ ప్లాన్‌ ప్రకారం.. నీలం, అమోల్‌లు పార్లమెంటుకు చేరుకొని నిరసన తెలియజేయాలి. ఒక వేళ ఇది సాధ్యం కాని పక్షంలో..ప్లాన్‌-బి ప్రకారం మహేశ్‌, కైలాశ్‌లు మరో మార్గంలో అక్కడికి చేరుకొని మీడియా కెమెరాల ముందు రంగు పొగ గొట్టాలను తెరిచి ఆందోళన చేయాలని భావించారట. అయితే, గుర్‌గ్రాంలో వీరంతా తలదాచుకున్న విక్కీ ఇంటికి చివరి నిమిషంలో మహేశ్‌, కైలాశ్‌లు చేరుకోలేదు. దీంతో నీలమ్‌, అమోల్‌ శిందేలే ఆ ప్లాన్‌ను అమలు చేయాలని తేల్చిచెప్పేశారు.

లోక్‌సభలో అలజడి ఘటన.. రెక్కీ చేసింది అతడే..!

పార్లమెంటులో అలజడికి సంబంధించి ఇప్పటి వరకు ఐదుగురు అరెస్టయ్యారు. వీరితో సంబంధమున్న మహేశ్‌, కైలాశ్‌ అనే రాజస్థాన్‌కు చెందిన మరో ఇద్దర్ని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. వీరంతా సోషల్‌ మీడియాలో ఏర్పాటు చేసుకున్న ‘జస్టిస్‌ ఫర్‌ ఆజాద్‌ భగత్‌సింగ్‌’ గ్రూపునకు చెందిన వారు. కాగా, వీరి నుంచి పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నారు. పార్లమెంటులో అలజడి సృష్టించే బృందంతో మహేశ్‌ కలిసి వెళ్లాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాలతో అతడి కుటుంబీకులు అడ్డుకోవడంతో గుర్‌గ్రాం వెళ్లలేకపోయినట్లు తెలిసింది. దాంతో నీలమ్‌, అమోలు అక్కడ ఆందోళన చేపట్టారు.

ఆధారాలను దహనం చేసి..

ఈ కుట్రకు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న లలిత్‌ ఝా గురువారం రాత్రి దిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అనంతరం విచారణలో ఈ ఘటనకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం. ఈ దాడి జరిపేందుకు కొన్ని నెలల నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పాడట. పార్లమెంటులోకి ప్రవేశించాలంటే ఎంట్రీ పాస్‌ తప్పనిసరి అని.. దీనికోసం అనేక ప్రయత్నాలు చేశాడని తెలిసింది. వివిధ ప్రాంతాల్లో బూట్లును ప్రత్యేకంగా తయారు చేయించడం, క్యానిస్టర్ల కొనుగోలుపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో నిందితులను విడివిడిగా విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు..

పార్లమెంటు బయట ఘటన జరుగుతోన్న సమయంలో ఆ దృశ్యాలను లలిత్‌ ఝా మొబైల్‌లో చిత్రీకరించాడు. లోపలికి వెళ్లిన ఇద్దరితోపాటు బయట ఆందోళన చేసిన ఇద్దరి.. (మొత్తం నలుగురు నిందితుల) మొబైల్‌ ఫోన్లు లలిత్‌ వద్దే ఉన్నాయి. అనంతరం దిల్లీ నుంచి రాజస్థాన్‌ పారిపోయాడు. అక్కడి నాగౌర్‌కు చెందిన మహేశ్‌ సాయంతో వాటిని కాల్చివేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆధారాలను నాశనం చేసేందుకే ఇలా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం ఓ హోటల్‌లో ఉంటూ తాజా పరిణామాలను గమనించిన లలిత్‌ ఝా.. గురువారం రాత్రి దిల్లీకి వచ్చి పోలీసులకు  లొంగిపోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని