Actor Laila Khan Murder:: నటి లైలా ఖాన్‌ హత్య కేసు.. సవతి తండ్రికి మరణశిక్ష

Actor Laila Khan Murder: నటి లైలా ఖాన్‌, ఆమె కుటుంబసభ్యులను అతి దారుణంగా హత్య చేసిన కేసులో.. ఆమె సవతి తండ్రికి మరణశిక్ష పడింది.

Published : 24 May 2024 17:15 IST

ముంబయి: ఒకప్పటి బాలీవుడ్‌ నటి లైలా ఖాన్‌ (Actor Laila Khan), ఆమె కుటుంబం 2011లో దారుణ హత్యకు గురైంది. ఈ కేసు (Murder Case)లో సుదీర్ఘ విచారణ అనంతరం ఆమె సవతి తండ్రిని ఇటీవల ముంబయి సెషన్స్‌ కోర్టు (Mumbai sessions court) దోషిగా తేల్చింది. తాజాగా అతడికి మరణశిక్ష (Death penalty) విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులకు 13 ఏళ్ల తర్వాత శిక్ష పడటం గమనార్హం.

ఏంటీ కేసు..

2011 జనవరి 30న లైలా తన తల్లి షెలీనా, నలుగురు సోదరీమణులతో కలిసి నాసిక్‌ జిల్లాలోని ఇగత్‌పురిలో గల తమ ఫామ్‌హౌస్‌కు వెళ్లింది. ఆ తర్వాత నుంచి వీరంతా కన్పించకుండా పోయారు. దీంతో షెలీనా మొదటి భర్త, లైలా తండ్రి నదీర్‌ షా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. షెలీనా మూడో భర్త పర్వేజ్‌ తక్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో అతడి కోసం గాలింపుచర్యలు చేపట్టారు.

ఆ మరుసటి ఏడాది 2012 జూన్‌లో పర్వేజ్‌ తక్‌ను జమ్మూకశ్మీర్‌ పోలీసులు ఓ కేసులో అరెస్టు చేశారు. విచారణ సమయంలో లైలా, ఆమె కుటుంబాన్ని తానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. వెంటనే వారు ముంబయి పోలీసులకు సమాచారమివ్వగా ఈ సామూహిక హత్యల విషయం వెలుగులోకి వచ్చింది. షెలీనా, ఆమె పిల్లల ఆస్తులపై కన్నేసిన పర్వేజ్‌ అవి తన పేరు మీద రాయాలంటూ ఆమెపై ఒత్తిడి పెంచాడు.

వలపు వలతో చంపి.. చర్మాన్ని ఒలిచి: బంగ్లా ఎంపీ హత్య కేసులో వెలుగులోకి దారుణాలు

ఘటన జరిగిన రోజు కూడా ఫామ్‌హౌస్‌లో ఇదే విషయమై అతడు గొడవ పడ్డాడు. అది తీవ్రమవడంతో షెలీనా తలపై బలమైన వస్తువుతో కొట్టి చంపాడు. అది చూసిన లైలా, ఆమె సోదరీమణులను సైతం అతి దారుణంగా కాల్చి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఫామ్‌హౌస్‌ నుంచి ఆరుగురి మృతదేహాల అవశేషాలను పోలీసులు బయటకు తీశారు. అనంతరం అతడిని అరెస్టు చేశారు. నిందితుడికి లష్కరే తోయిబాతో సంబంధాలున్నట్లు దర్యాప్తులో తెలిసింది. హత్య అనంతరం నేపాల్‌ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా జమ్మూకశ్మీర్‌ పోలీసులకు చిక్కాడు.

లైలాఖాన్‌ 2002లో కన్నడ చిత్రం మేకప్‌తో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత కొన్ని చిన్నచిన్న చిత్రాల్లో కన్పించింది. 2008లో రాజేశ్ ఖన్నా సరసన ఆమె చేసిన ‘వాఫా: ఎ డెడ్లీ లవ్‌ స్టోరీ’ సినిమా ఆమెకు గుర్తింపుతెచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని