Nirmala Sitharaman: ‘యూపీఏ పాలనలో.. జాతీయ భద్రతకు విఘాతం!’

యూపీఏ పదేళ్ల హయాంలో జాతీయ భద్రతకు విఘాతం కలిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆరోపించారు. ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఆలస్యమయ్యాయన్నారు.

Updated : 09 Feb 2024 23:12 IST

దిల్లీ: కాంగ్రెస్‌ (Congress) నేతృత్వంలోని యూపీఏ పదేళ్ల పాలనలో జాతీయ భద్రతకు విఘాతం కలిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ఆరోపించారు. అభివృద్ధి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఆలస్యమయ్యాయని, ప్రభుత్వ నాయకత్వం విఫలమైందని విమర్శలు గుప్పించారు. 2014కి ముందు, తర్వాత దేశ ఆర్థిక స్థితిగతులపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై లోక్‌సభ (Lok Sabha)లో శుక్రవారం నిర్వహించిన చర్చకు సీతారామన్ సమాధానమిచ్చారు.

కాంగ్రెస్‌ హయాంలో రక్షణ రంగ నిర్వహణ అస్తవ్యస్తంగా సాగిందని పేర్కొన్న కేంద్రమంత్రి నిర్మల.. రూ.3,600 కోట్ల అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ వీవీఐపీ చాపర్ల కుంభకోణాన్ని ప్రస్తావించారు. ‘‘2014లో ప్రభుత్వ బాధ్యతలు మా చేతుల్లోకి వచ్చేటప్పటికీ.. రక్షణ బలగాల వద్ద మందుగుండు సామగ్రి, రక్షణ పరికరాలకు తీవ్ర కొరత నెలకొంది. సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, నైట్ విజన్ కళ్లద్దాలూ అందుబాటులో లేవు’’ అని సీతారామన్ చెప్పారు. 2013-14లో రూ.2.53 లక్షల కోట్లుగా ఉన్న రక్షణ బడ్జెట్‌ను 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.6.22 లక్షల కోట్లకు పెంచినట్లు ఆమె తెలిపారు.

యూపీయే నాటి సవాళ్లు అధిగమించాం

యూపీఏ హయాంలో ‘జయంతి ట్యాక్స్‌’ వల్ల ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఏడాది వరకు ఆలస్యం అయ్యేవని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రాజెక్టులకు అనుమతులు జారీ చేయడానికి సగటు సమయం 2011 నుంచి 2014 నాటికి 86 రోజుల నుంచి 316 రోజులకు పెరిగిందన్నారు. కాంగ్రెస్‌ రెండో పాలనలో పర్యావరణ, అటవీశాఖ మంత్రి (స్వతంత్ర హోదా)గా జయంతి నటరాజన్‌ విధులు నిర్వహించిన విషయం తెలిసిందే.

మోదీ ప్రభుత్వం పదేళ్లుగా అంకితభావంతో చేసిన కృషి.. దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలపైకి తెచ్చిందని నిర్మల తెలిపారు. గత పాలనలోని లోపాలను సరిదిద్దామని, సంస్కరణలపై దృష్టి సారించామని చెప్పారు. యూపీఏ పాలనలో సగటున ఏటా ఒక భారీ అవినీతి చోటుచేసుకుందని.. ఈ పరిణామాలతో సామాన్య ప్రజలు నిరాశకు గురయ్యారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని