Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ చరిత్రలోనే అతిపెద్ద ఎన్‌కౌంటర్‌.. అమిత్‌ షా ఏమన్నారంటే!

దేశాభివృద్ధి, శాంతి భద్రతలు, యువత భవిష్యత్తుకు నక్సలిజం అతిపెద్ద శత్రువని అమిత్‌ షా పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ విషయంలో భద్రతా సిబ్బంది ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.

Published : 16 Apr 2024 22:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ.. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌ (Chhattisgarh Encounter)లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. మావోయిస్టుల మరణాల విషయంలో ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు చోటుచేసుకున్న అతిపెద్ద ఎదురుకాల్పుల ఘటన ఇదే కావడం గమనార్హం. ఆపరేషన్‌ విజయవంతంగా సాగిందని పేర్కొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah).. భద్రతా సిబ్బంది ధైర్యసాహసాలను ప్రశంసించారు.

దేశాభివృద్ధి, శాంతి భద్రతలు, యువత ఉజ్వల భవిష్యత్తుకు నక్సలిజం అతిపెద్ద శత్రువు అని అమిత్‌ షా పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తి కల్పించాలని సంకల్పించినట్లు చెప్పారు. ఈ భావజాలం ఇప్పుడు చిన్న ప్రాంతానికే పరిమితమైందని, త్వరలో ఛత్తీస్‌గఢ్‌తోపాటు దేశం మొత్తం నక్సల్స్ రహితంగా మారుతుందన్నారు. గాయపడిన సిబ్బంది త్వరగా కోలుకోవాలని ‘ఎక్స్‌’ వేదికగా ఆకాంక్షించారు. మరోవైపు.. ఛత్తీస్‌గఢ్‌ ఉపముఖ్యమంత్రి విజయ్‌ శర్మ.. ఈ ఘటనను ‘సర్జికల్‌ స్ట్రైక్స్‌’గా పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల వేళ.. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

కాంకేర్‌లోని ఛోటేబేథియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హపటోలా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మంగళవారం కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులకు, వారికి మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో  మొత్తం 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో కీలక నేత శంకర్‌రావు కూడా ఉన్నాడని, అతడిపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఎదురుకాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు జవాన్లు గాయపడినట్లు సమాచారం. బస్తర్ ప్రాంతంలో 2024లోనే ఇప్పటివరకు జరిగిన వేర్వేరు ఘటనల్లో 79 మంది మావోయిస్టులు మరణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని