Encounter: లోక్‌సభ ఎన్నికల వేళ.. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

లోక్‌సభ ఎన్నికల వేళ.. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది.

Updated : 16 Apr 2024 22:27 IST

రాయ్‌పుర్: మరో 10 రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరగనుండగా.. ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని కాంకేర్‌ (Kanker) జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ (Encounter) చోటుచేసుకుంది. ఛోటేబేథియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బీఎస్‌ఎఫ్‌ తెలిపింది. మృతుల్లో మావోయిస్టు కీలక నేత శంకర్‌రావు కూడా ఉన్నాడని, అతడి మీద రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఎదురుకాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు జవాన్లు గాయపడినట్లు సమాచారం.

బీఎస్‌ఎఫ్‌, డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపడుతుండగా.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఛోటేబేథియా పీఎస్‌ పరిధిలోని హపటోలా అటవీ ప్రాంతంలో ఇరుపక్షాల మధ్య ఎన్‌కౌంటర్‌ మొదలైందని బీఎస్‌ఎఫ్‌ తెలిపింది. ఘటనా స్థలంలో ఏకే 47 తుపాకులు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన భద్రత సిబ్బందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా.. కాంకేర్ లోక్‌సభ స్థానానికి రెండో దశలో భాగంగా ఏప్రిల్ 26న పోలింగ్‌ నిర్వహించనున్నారు.

నక్సలిజం నుంచి దేశాన్ని విముక్తి చేయాలి: అమిత్ షా

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందించారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న భద్రతా సిబ్బందికి అభినందనలు తెలిపారు. ‘‘భద్రతా సిబ్బంది పరాక్రమంతో ఆపరేషన్‌ విజయంతమైంది. గాయపడిన పోలీసులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. శాంతి, అభివృద్ధి, ఉజ్వల భవిష్యత్‌కి నక్సలిజం అతిపెద్ద శత్రువు. దాన్నుంచి దేశాన్ని విముక్తి చేయాలని నిర్ణయించుకున్నాం’’ అని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని