Kangana Ranaut: కంగనపై పోస్టు వివాదం.. కాంగ్రెస్‌ నేతపై జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut)కు సంబంధించిన ఓ అభ్యంతరకర పోస్టుపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. 

Updated : 26 Mar 2024 22:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha Elections) భాజపా అభ్యర్థిగా పోటీ చేయనున్న సినీ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut)కు సంబంధించిన ఓ అభ్యంతరకర పోస్టు దుమారం రేపుతోంది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ (NCW) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యకు పాల్పడిన సుప్రియా శ్రీనతే (Supriya Shrinate)పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. తన ఫిర్యాదులో హెచ్‌.ఎస్‌.అహిర్‌ పేరును ప్రస్తావించింది. మహిళల గౌరవానికి భంగం కలిగించే ప్రవర్తన ఏ మాత్రం సహించరానిదని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ అభ్యర్థిగా బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను భాజపా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమెను ఉద్దేశించి కాంగ్రెస్ మహిళా నేత సుప్రియ (Supriya Shrinate)చేసిన పోస్టుపై భాజపా వర్గాలు భగ్గుమన్నాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను డిమాండ్‌ చేశాయి. ప్రతి మహిళ తన గౌరవానికి అర్హురాలని పేర్కొన్న కంగన (Kangana Ranaut).. గుజరాత్ కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన అభ్యంతరకర సంభాషణను షేర్ చేశారు.

నాడు హిమాచల్‌ను వద్దనుకున్న కంగన!

‘‘ఒక యువకుడికి టికెట్ లభిస్తే.. అతడి సిద్ధాంతాలను విమర్శిస్తారు. అదే యువతికి టికెట్ ఇస్తే.. ఆమె లైంగికతపై దాడి జరుగుతుంది. ఇదేం విచిత్రమో. కాంగ్రెస్ నేతలు ప్రదర్శించిన ఇలాంటి అసభ్యకరమైన ధోరణి సిగ్గుచేటు’’ అని విరుచుకుపడ్డారు. ఈ సమయంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఈ బాలీవుడ్ నటికి మద్దతుగా నిలిచారు. ఉక్కు మహిళలతో ఎలా వ్యవహరించాలో ఆ నేతలకు తెలీదంటూ ఎద్దేవా చేశారు.

ఇదిలాఉంటే.. ఈ పోస్టుపై ఇప్పటికే సుప్రియ స్పష్టత ఇచ్చారు. ‘‘నా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల యాక్సెస్‌ చాలామంది వద్ద ఉంది. వారిలో ఒకరు ఈ అభ్యంతరకర పోస్ట్‌ పెట్టారు. నా దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని తొలగించాను. నేను ఏ మహిళ గురించి కూడా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయను. ఈ వ్యవహారంపై ‘ఎక్స్‌’లో ఫిర్యాదు చేశాను’’ అని వివరణ ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని