Jagdeep Dhankhar: ధన్‌ఖడ్‌కు సంఘీభావంగా.. సభలో నిలబడ్డ ఎన్డీయే ఎంపీలు

Jagdeep Dhankhar: రాజ్యసభలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. పార్లమెంట్‌లో విపక్షాల నిరసన ప్రదర్శనపై ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌కు సంఘీభావంగా ఎన్డీయే ఎంపీలు కొద్దిసేపు నిలబడే సభా కార్యకలాపాల్లో పాల్గొన్నారు.

Updated : 20 Dec 2023 13:37 IST

దిల్లీ: పార్లమెంట్‌ ప్రాంగణంలో జరిగిన నిరసన ప్రదర్శనపై పెను దుమారం రేగుతోంది. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ (Rajya Sabha) ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankhar)ను అనుకరిస్తూ తృణమూల్‌ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ వ్యవహరించిన తీరును ఎన్డీయే (NDA) నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే ధన్‌ఖడ్‌కు సంఘీభావంగా అధికార పక్ష ఎంపీలు బుధవారం రాజ్యసభలో కొద్దిసేపు నిల్చునే సభా కార్యకలాపాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటనను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు (విపక్షాలు) అన్ని హద్దులు దాటుతున్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను పదే పదే అవమానిస్తున్నారు. గత 20 ఏళ్లుగా ప్రధాని మోదీ ఇలాంటి అవమానాలే ఎదుర్కొంటున్నారు. రాజ్యాంగాన్ని, ఉపరాష్ట్రపతిని అవమానిస్తే సహించేది లేదు. మీ మీద గౌరవంతో వారు చేసిన చర్యలకు నిరసనగా ఈ ప్రశ్నోత్తరాల గంట మొత్తం నిలబడే పాల్గొంటాం’’ అని వెల్లడించారు.

పార్లమెంట్‌లో నిరసన ఘటన.. ఉపరాష్ట్రపతికి మోదీ ఫోన్‌

ఎన్డీయే ఎంపీలంతా నిలబడి ఉండగా కొన్ని నిమిషాల పాటు ప్రశ్నోత్తరాల గంట కొనసాగింది. ఆ తర్వాత ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌ స్పందిస్తూ.. ‘‘మీ సంఘీభావం నా మనసును తాకింది. మీరంతా కూర్చోవాలని కోరుతున్నా’’ అని అన్నారు. అనంతరం అధికార పక్ష ఎంపీలంతా వారి సీట్లలో కూర్చుని సభా కార్యకలాపాల్లో పాల్గొన్నారు.

పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటన చేయాలనే డిమాండ్‌తో ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం 141 మంది సభ్యులు సస్పెండ్‌ అయ్యారు. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. సస్పెన్షన్‌కు గురైన సభ్యులు పార్లమెంటు భవన మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ను అనుకరిస్తూ తృణమూల్‌ నేత కల్యాణ్‌ బెనర్జీ చేసిన హాస్య ప్రదర్శనను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చిత్రీకరించారు. మరికొందరు నేతలు స్పీకర్‌ను అనుకరించారు. ఈ ఘటన తనను బాధించిందని ధన్‌ఖడ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని