Chandra Bose: భాజపాను వీడిన నేతాజీ మనవడు

Chandra Bose: నేతాజీ మనవడు చంద్ర కుమార్‌ బోస్‌ భాజపా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డాకు లేఖ రాశారు.

Published : 06 Sep 2023 18:12 IST

కోల్‌కతా: స్వాత్రంత్య ఉద్యమకారుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ (Netaji Subhas Chandra Bose) మనవడు, బెంగాల్‌ భాజపా మాజీ ఉపాధ్యక్షుడు చంద్ర కుమార్‌ బోస్‌ (Chandra Kumar Bose) భాజపాను వీడారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. నేతాజీ దార్శనికతను ప్రచారం చేస్తామన్న హామీని కాషాయ పార్టీ నిలబెట్టుకోలేదని, అందుకే భాజపా (BJP) నుంచి వైదొలుగుతున్నట్లు చంద్ర కుమార్‌ బోస్‌ తెలిపారు.

ఈ మేరకు భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు చంద్ర కుమార్‌ బోస్‌ తన రాజీనామా లేఖను పంపారు. ‘‘భాజపా వేదికగా నేతాజీ సోదరుల (సుభాష్‌, శరత్‌ చంద్రబోస్‌) సిద్ధాంతాలను నేటి తరానికి అందజేయాలని నేను భావించాను. ఇందుకు గతంలో పార్టీ హైకమాండ్‌ కూడా హామీ ఇచ్చింది. అయితే, ఈ లక్ష్యాలను చేరుకోవడంలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో పార్టీ నుంచి నాకు సహకారం లభించట్లేదు. నా ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదు’’ అని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే, ఈ లేఖపై బెంగాల్‌ రాష్ట్ర భాజపా అధికార ప్రతినిధి శామిక్‌ భట్టాచార్య స్పందించారు. చాలా కాలంగా ఆయన పార్టీతో టచ్‌లో లేరని తెలిపారు.

‘భారత్‌’, ‘సనాతన..’పై ఆచితూచి మాట్లాడండి.. మంత్రులతో మోదీ

చంద్ర కుమార్‌ బోస్‌ 2016లో భాజపా చేరారు. ఆ ఏడాది జరిగిన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ టికెట్‌పై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడిపోయారు. పార్టీలో చేరిన తర్వాత ఆయనను బెంగాల్‌ భాజపా ఉపాధ్యక్షుడిగా నియమించారు. అయితే, 2020లో పార్టీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా చంద్ర కుమార్‌ను ఆ పదవి నుంచి తప్పించారు.

ఇదిలా ఉండగా.. చంద్ర కుమార్‌ గతంలో పలుమార్లు సొంత పార్టీని వ్యతిరేకిస్తూ వార్తల్లో నిలిచారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పార్టీ విధానానికి వ్యతిరేకంగా 2019లో బహిరంగంగానే తన నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఏ చట్టాన్నీ ప్రజలపై బలవంతంగా రుద్ద కూడదని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో ఆధిక్యం ఉన్నంత మాత్రాన భయపెట్టే రాజకీయ ధోరణిని అవలంబించొద్దని హితవు పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని