PM Modi: ‘భారత్‌’, ‘సనాతన..’పై ఆచితూచి మాట్లాడండి.. మంత్రులతో మోదీ

PM Modi: వివాదాస్పద అంశాలపై సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా సరిగ్గా స్పందించాలని ప్రధాని మోదీ కేంద్రమంత్రులను సూచించారు. సనాతన ధర్మ వివాదం, ‘భారత్‌’ అంశాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Published : 06 Sep 2023 16:40 IST

దిల్లీ: ‘ప్రెసిడెంట్‌ ఆప్‌ భారత్‌ (President Of Bharat)’ పేరిట రాష్ట్రపతి పంపిన ఆహ్వాన పత్రాలపై తాజాగా రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. అటు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ‘సనాతన ధర్మం (Sanatan Dharma)’పై చేసిన వ్యాఖ్యలూ తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ రెండు అంశాలపై తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) స్పందించినట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై ఆచితూచి మాట్లాడాలని.. కేంద్రమంత్రులకు సూచించినట్లు సమాచారం. ఈ మేరకు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో ‘భారత్‌ (Bharat)’ అంశాన్ని ప్రధాని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ‘భారత్‌’ అంశంపై అతిగా స్పందించొద్దని కేంద్రమంత్రులను ఆయన సూచించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. కేవలం సంబంధిత వ్యక్తులు మాత్రమే దీనిపై మాట్లాడాలని మోదీ స్పష్టం చేసినట్లు తెలిపాయి. రాష్ట్రపతి ఆహ్వాన పత్రికలతో పాటు జీ-20 విదేశీ అతిథులకు పంపిణీ చేస్తున్న పుస్తకాల్లోనూ కేంద్ర ప్రభుత్వం ఇండియా (India)కు బదులు భారత్‌ అని ముద్రించింది. దీంతో ఆంగ్లంలోనూ దేశం పేరు ఇక భారత్‌ (Bharat) మాత్రమే ఉండేలా మార్పులు తీసుకురానున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇండియా స్థానంలో భారత్‌!

‘సనాతన’ వ్యాఖ్యలు తిప్పికొట్టండి..

ఈ సందర్భంగా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) ‘సనాతన ధర్మం (Sanatan Dharma)’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపైనా ప్రధాని పరోక్షంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఆ వ్యాఖ్యలను సమర్థంగా తిప్పికొట్టాలని కేంద్రమంత్రులకు ఆయన సూచించినట్లు సమాచారం. ‘‘చరిత్రలోతుల్లోకి తొంగిచూడొద్దు. కానీ, రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు కట్టుబడి ఉండండి. సమకాలీన పరిస్థితుల గురించి మాట్లాడండి. వివాదాస్పద వ్యాఖ్యలకు సమర్థమైన స్పందన అవసరం’’ అని మోదీ సూచించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

గతవారం తమిళనాడులోని ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ.. ‘‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇది కాస్తా తీవ్ర దుమారం రేపింది. ఆయన వ్యాఖ్యలపై భాజపా నేతలు, హిందూ సంఘాల ప్రతినిధులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అటు విపక్ష పార్టీల కూటమి ‘ఇండియా’లోని కొందరు నేతలు కూడా ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఉదయనిధిపై తమిళనాడు, యూపీలో కేసులు కూడా నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని