PM Modi: గూగుల్ ‘జెమిని’లో మోదీపై వివాదాస్పద సమాధానం.. కేంద్రం సీరియస్‌

PM Modi: ప్రధాని మోదీపై గూగుల్‌ ఏఐ టూల్‌ ఇచ్చిన సమాధానం వివాదాస్పదమైంది. దీన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. అసలేం జరిగిదంటే..

Published : 23 Feb 2024 15:33 IST

దిల్లీ: ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ (Google) ఇటీవల అత్యంత అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ టూల్‌ ‘జెమిని (Gemini AI)’ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇది కచ్చితత్వంతో వేగవంతమైన ఫలితాలు ఇస్తుందని కంపెనీ తెలిపింది. అయితే, ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) గురించి అడిగిన ఓ ప్రశ్నకు ‘జెమిని’ చెప్పిన సమాధానం ఇప్పుడు వివాదాస్పదమైంది. దీంతో కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘ప్రధాని మోదీ ఫాసిస్టా?’ అని ఓ నెటిజన్‌ అడగ్గా.. జెమిని ఏఐ అనుచిత సమాధానం ఇచ్చింది. ఇదే ప్రశ్నను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గురించి అడిగితే మాత్రం.. ‘కచ్చితంగా, స్పష్టంగా చెప్పలేం’ అంటూ దాటవేత ధోరణిలో జవాబిచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను ఓ జర్నలిస్టు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయగా అవి వైరల్‌ అయ్యాయి. దీంతో ‘జెమిని’పై విమర్శలు వ్యక్తమయ్యాయి. గూగుల్ ఏఐ టూల్‌ పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ నెటిజన్లు మండిపడ్డారు.

అర్ధరాత్రి వేళ.. వారణాసి రోడ్డును తనిఖీ చేసిన మోదీ

ఇది కాస్తా కేంద్రప్రభుత్వం దృష్టికి రావడంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పందిస్తూ.. ‘‘ఇది ఐటీ చట్టం నిబంధనల ప్రత్యక్ష ఉల్లంఘన కిందకు వస్తుంది. క్రిమినల్‌ కోడ్‌ నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లే’’ అని హెచ్చరించారు.

గతేడాది డిసెంబరులో గూగుల్‌ ఈ అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది టెక్ట్స్‌, ఫొటో, ఆడియో, వీడియో, కోడింగ్ వంటి వివిధ రకాల సమాచారాన్ని 90 శాతం కచ్చితత్వంతో యూజర్లకు అందిస్తుందని తెలిపింది. అయితే, ఇటీవల దీని వాడకంపై గూగుల్‌ యూజర్లకు కీలక సూచనలు చేసింది. ఈ ఏఐ టూల్‌ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకునే క్రమంలో లేదా సమాచారం తెలుసుకునే సమయంలో వ్యక్తిగత, సున్నితమైన డేటాని షేర్‌ చేయొద్దని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని