ఈ ట్రాఫిక్‌ క్లియర్‌ అయ్యేలోగా.. హాలిడే అయిపోతుందేమో..! మనాలి జామ్‌పై నెటిజన్ల రియాక్షన్‌

క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల కోసం ప్రజలు భారీగా పర్యాటక ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో హిమాచల్‌ ప్రదేశ్‌(Himachal Pradesh)లో ట్రాఫిక్ జామ్ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. 

Updated : 25 Dec 2023 13:29 IST

శిమ్లా: ఇటీవల వరదలతో అల్లాడిపోయిన హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh).. ప్రస్తుతం పర్యాటకులతో కళకళలాడుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల వేళ.. పెద్ద సంఖ్యలో పర్యాటకుల రాకతో మనాలి(Manali ), అటల్‌ టన్నెల్‌( Atal Tunnel) మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు వరుస కట్టిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా స్పందించారు. పర్యాటకులకు ఆహ్వానం పలికారు.

‘10 వేల అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్‌ నుంచి డిసెంబర్ 24న 12 వేల వాహనాల్లో 65వేల మంది ప్రయాణించారు. ప్రకృతి విపత్తు నుంచి కోలుకున్న హిమాచల్‌ ప్రదేశ్‌.. ఈ పండగ సీజన్‌లో పర్యాటకులను ఆహ్వానిస్తోంది’ అని వెల్లడించారు. మైనస్‌ 12 డిగ్రీల చలిలో ఈ టన్నెల్‌ వద్ద రాకపోకలను పర్యవేక్షిస్తోన్న సిబ్బందిని అభినందించారు. పొగమంచు, వేల సంఖ్యలో పర్యాటకుల రాకతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్నిగంటల పాటు వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. దీనిపై కొందరు నెటిజన్లు తమ అసహనం వ్యక్తం చేయగా.. మరికొంత మంది సరదాగా స్పందించారు.

‘పొగమంచు ప్రభావం.. విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం’

  • అటల్‌ టన్నెల్‌ వద్ద ఐదు గంటల నుంచి చిక్కుకుపోయి ఉన్నాను.
  • ఈ జామ్‌ క్లియర్‌ అయ్యేలోగా.. హాలిడే అయిపోతుందేమో..!
  • మేం క్రిస్మస్ కంటే ముందు వచ్చాం కాబట్టి మాకు ఇంత ట్రాఫిక్‌ జామ్‌ ఎదురుకాలేదు.. ఇప్పుడు వచ్చే వారు దీనికి అనుగుణంగా ప్లాన్‌ చేసుకోండి..అని రాసుకొచ్చారు.

ఇలా ట్రాఫిక్‌తో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో కొందరు ఆకతాయిల చర్యలు నెటిజన్లను ఆగ్రహానికి గురిచేశాయి. రోడ్డుపై డోర్లు తెరిచి ఓ వ్యక్తి కారు నడుపుతుండగా.. మరికొందరు ఆ డోర్లకు వేలాడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి చర్యలతో కారు అదుపు తప్పే ప్రమాదం ఉందని, రోడ్లపై ఇలాంటి స్టంట్లు చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని