S Jaishankar: పాక్‌తో చర్చలు.. తలుపులు మూయలేదు: జైశంకర్

పాకిస్థాన్‌తో చర్చలు జరిపాల్సి వస్తే.. ఆ భేటీలో ప్రధాన అంశం ఉగ్రవాదమే అవుతుందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ తెలిపారు. 

Updated : 12 Mar 2024 14:16 IST

దిల్లీ: పాకిస్థాన్‌ (Pakistan)తో చర్చలకు భారత్‌ తలుపులు ఎప్పుడూ మూయలేదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (S Jaishankar) అన్నారు. ఒకవేళ ఇరు దేశాలు చర్చలు జరపాల్సి వస్తే.. ప్రధానమైన అంశం ఉగ్రవాదమని స్పష్టం చేశారు. ఇటీవల జపాన్‌, దక్షిణ కొరియా పర్యటన అనంతరం దిల్లీ చేరుకున్న ఆయన.. సోమవారం ఓ జాతీయ వార్తా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌-పాక్‌ సంబంధాలు, చైనాతో సరిహద్దు వివాదం, రష్యాతో స్నేహం..తదితర అంశాలపై మాట్లాడారు. ‘‘పాకిస్థాన్‌తో చర్చలకు తలుపులు మేం ఎప్పుడూ మూయలేదు. పెద్ద సంఖ్యలో ఉగ్రవాద కేంద్రాలు ఉన్న దేశంతో చర్చించాల్సి వస్తే.. ముఖ్యంగా దాని గురించే మాట్లాడాలి. ఇతరత్రా సమస్యలు ఉన్నా కూడా ప్రధానంగా ఉగ్రవాదంపైనే చర్చ ఉంటుంది’’ అని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌ సైన్యంతో భేటీ అయ్యే పరిస్థితులు లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

భారత్-చైనా సంబంధాల గురించి మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదంపై చర్చలు జరుగుతున్నా ఎలాంటి ఫలితం వెలువడలేదన్నారు. ‘‘వాస్తవాధీన రేఖ (LAC) వద్ద పెద్ద సంఖ్యలో బలగాలు మోహరించడం భారత్‌కు అవసరం. అదే సమయంలో సరిహద్దు వివాదంపై న్యాయమైన పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం. గతంలో చేసుకున్న ఒప్పందాలను భారత్‌ గౌరవిస్తుంది. ఎల్‌ఏసీ వద్ద ఎలాంటి మార్పులు చేయకుండా ఉన్న పరిస్థితిని కొనసాగించేందుకు అంగీకరిస్తాం. అదే ఇరు పక్షాలకు మంచిదని భావిస్తున్నా. ఈ వివాదానికి సహేతుకమైన పరిష్కారం త్వరలోనే లభిస్తుంది’’ అని జైశంకర్‌ తెలిపారు. 

అరుణాచల్‌ మాదే.. మీ పిచ్చివాదన వాస్తవాలను మార్చదు: చైనాకు భారత్‌ చురక

అమెరికాతో భారత్‌ సంబంధాలు.. చైనాతో రష్యా అనుసరిస్తున్న విధానాలపై  ప్రభావం చూపిస్తాయా? అన్న ప్రశ్నకు.. ‘‘రష్యా-చైనాలు దగ్గరైతే అది భారత్‌కు సమస్య కాదు. పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా తన ప్రయోజనాల కోసం రష్యా అలాంటి నిర్ణయం తీసుకోవచ్చు. ఆ దేశం విషయంలో మా వైఖరిని స్పష్టం చేశాం. మా లక్ష్యం వేరే ఉంది’’ అని సమాధానమిచ్చారు. మయన్మార్‌లో పరిణామాలు ఆందోళనకరమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని