Navy: లక్షద్వీప్‌లో భారత నౌకాదళ స్థావరం..!

మాల్దీవులకు అత్యంత సమీపంలో భారత్‌ నిర్మించిన నౌకాదళ స్థావరం వచ్చే వారం ప్రారంభం కానుంది.

Updated : 01 Mar 2024 14:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ సరికొత్త నౌకాదళ (Navy) స్థావరాన్ని వచ్చే వారం ప్రారంభించనుంది. దీనికి ‘ఐఎన్‌ఎస్‌ జటాయు’గా పేరు పెట్టారు. దీంతో హిందూ మహా సముద్రంపై నిఘా మరింత పెంచే అవకాశం లభించనుంది. లక్షద్వీప్‌ (Lakshadweep)లోని మినికాయ్‌ ద్వీపంపై ఏర్పాటు చేసిన ఈ స్థావరంలో తొలుత తక్కువ మంది అధికారులు, సిబ్బంది ఉంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో దీనిని అతిపెద్ద నౌకాదళ స్థావరాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నాయి.

విమాన వాహక నౌకలైన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యపై కమాండర్స్ కాన్ఫరెన్స్‌ ప్లాన్‌ జరగనుంది. ఈ రెండు భారీ నౌకలు కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొననుండటం ఇదే తొలిసారి. ఆ సందర్భంగానే జటాయును కూడా ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇప్పటికే తూర్పున అండమాన్‌-నికోబార్‌ ద్వీపాల్లో ఉన్న ఐఎన్‌ఎస్‌ బాజ్‌ స్థావరం మాదిరిగా.. పశ్చిమాన జటాయు సేవలు అందించనుంది.

ఇళ్లలో సౌర వెలుగులకు రూ.75,000 కోట్లు

ఐఎన్‌ఎస్‌ జటాయు మాల్దీవుల్లోని ద్వీపాలకు దాదాపు 50 మైళ్ల దూరంలో ఉంటుంది. హిందూ మహా సముద్రంలో సైనిక, వాణిజ్య నౌకల కదలికలను పరిశీలించడానికి భారత్‌కు అవకాశం లభిస్తుంది. మరోవైపు ఎంహెచ్‌-60 హెలికాప్టర్లను కూడా వచ్చేవారం దళంలోకి చేర్చుకోనున్నారు. గోవాలో నిర్మించిన నౌకాదళ కళాశాలను కూడా ఈ సందర్భంగా ప్రారంభించే అవకాశం ఉంది.

జటాయు స్థావరానికి సమీపంలోనే నౌకాదళం ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యను మోహరించి ఉంచే అవకాశాలున్నాయి. కమాండర్స్ కాన్ఫరెన్స్‌ సందర్భంగా నేవీకి చెందిన యుద్ధ విమానాలు ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌పై నుంచి టేకాఫ్‌ అయి.. మరో దానిపై ల్యాండింగ్‌ కావడం వంటి హైటెంపో ఆపరేషన్లను నిర్వహించనుంది. జలాంతర్గాములు, మరికొన్ని యుద్ధ నౌకలు కూడా ఈ సందర్భంగా క్యారియర్‌ గ్రూప్‌ కార్యకలాపాల్లో పాలుపంచుకోనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని