Soami Bagh Mausoleum: నిర్మాణంలో మేటి.. తాజ్‌ మహల్‌కు పోటీ..!

ఆగ్రాలో ఓ నిర్మాణం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అదే.. రాధాస్వామి అనే ఆధ్యాత్మిక సంప్రదాయానికి పునాది వేసిన ‘శివ్‌ దయాళ్‌ సింగ్‌’ సమాధి.

Published : 17 May 2024 20:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఆగ్రా అంటే మనకు ఠక్కున గుర్తొచ్చేది ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌ మహలే (Taj Mahal). ఇప్పుడు అదే నగరంలో ధవళవర్ణంలో మెరుస్తోన్న మరో నిర్మాణం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అదే.. రాధాస్వామి ఆధ్యాత్మిక సంప్రదాయానికి పునాది వేసిన ‘శివ్‌ దయాళ్‌ సింగ్‌’ పాలరాతి సమాధి (Soami Bagh mausoleum). తాజ్‌ మహల్‌కు 12 కి.మీ. దూరంలోని స్వామి బాగ్‌ కాలనీలో ఉన్న దీని నిర్మాణపనులకు ఏకంగా 100 ఏళ్లకుపైగా పట్టడం గమనార్హం.

1904లో నిర్మాణపనులు ప్రారంభమైనప్పటికీ.. అనంతరం అవి నిలిచిపోయాయి. 1922 నుంచి పునః ప్రారంభం కాగా ఎన్నో అవాంతరాలు దాటుకుంటూ.. ఇప్పుడు కొలిక్కివచ్చాయి. ఇంకా చిన్నచిన్న పనులు మిగిలిఉన్నాయి. ఆధ్యాత్మిక పర్యటకులను ఇది ఆకట్టుకుంటోంది. విభిన్న శైలులను మిళితం చేసి కట్టిన ఈ నిర్మాణాన్ని.. తాజ్‌కు తగిన పోటీ అని చెబుతున్నారు. రాజస్థాన్‌లోని మక్రానా, జోధ్‌పుర్‌ల నుంచి తెచ్చిన పాలరాతితో 193 అడుగుల ఎత్తైన కట్టడంగా దీనిని నిర్మించారు.

ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి

ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, కర్ణాటకలతోపాటు విదేశాలకు చెందిన లక్షలాదిమంది రాధాస్వామి సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. వారంతా దీని సందర్శనకు వస్తున్నారు. ఇది తాజ్‌మహల్‌కు పోటీ కాదంటూ సంబంధిత ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. తన సతీమణి ముంతాజ్‌ మహల్‌ స్మృత్యర్థం మొగల్‌ చక్రవర్తి షాజహాన్‌ 17వ శతాబ్దంలో తాజ్‌మహల్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. 22 ఏళ్లపాటు వేలాదిమంది కార్మికులు పనిచేసి దానిని ప్రపంచ అద్భుతంగా తీర్చిదిద్దారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని