Narayana Murthy: ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి

Narayana Murthy: భారత్‌లో ప్రతీ విద్యార్థి చదవాల్సిన పుస్తకాన్ని ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి పంచుకున్నారు. అలాగే కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయనే అపోహలపైనా స్పందించారు.

Published : 17 May 2024 16:28 IST

Narayana Murthy | ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో ప్రతీ విద్యార్థి చదవాల్సిన ఓ పుస్తకాన్ని ఇన్ఫోసిస్‌ సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) పంచుకున్నారు. పాల్ జి.హెవిట్‌ రాసిన ‘కాన్సెప్చువల్‌ ఫిజిక్స్‌’ను (Conceptual Physics) ప్రతిఒక్కరూ చదవాలని సూచించారు. దీన్ని రచయిత అద్భుతంగా రాశారని.. అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

‘‘ప్రస్తుతం నేను కాన్సెప్చువల్‌ ఫిజిక్స్‌ అనే పుస్తకాన్ని చదువుతున్నాను. దీన్ని హైస్కూల్‌ టీచర్‌ పాల్‌ హెవిట్‌ రాశారు. హైస్కూల్‌ విద్యార్థులను దృష్టిలోఉంచుకొని రచించారు. ఫిజిక్స్‌ ఎలా బోధించాలో అద్భుతంగా వివరించారు. రచయిత నుంచి అనుమతి లభిస్తే దీన్ని అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాలి. దీంట్లో అద్భుతమైన ఎక్సర్‌సైజులు ఉన్నాయి. క్లిష్టమైన ఐడియాలను చాలా చక్కగా వివరించారు. శ్రీనగర్‌ నుంచి కన్యాకుమారి.. మేఘాలయ నుంచి జామ్‌నగర్‌ వరకు ప్రతిఒక్కరూ దీన్ని చదవాలి. ‘సైన్స్‌, ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, మేథమేటిక్స్‌ సబ్జెక్టుల్లో మంచి అవగాహన ఏర్పడుతుంది’’ అని ఓ ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణమూర్తి (Narayana Murthy) వెల్లడించారు.

వరల్డ్‌ ‘సూపర్‌-రిచ్‌’లో 15 మంది.. జాబితాలో అదానీ

ఏఐతో కొత్త అవకాశాలు..

కృత్రిమ మేధ వల్ల (Artificial Intelligence- AI) ఉద్యోగాలు కోల్పోతామనే భయాలను నారాయణ మూర్తి (Narayana Murthy) కొట్టిపారేశారు. దీన్ని మరీ ఎక్కువ చేసి చూపుతున్నారని అభిప్రాయపడ్డారు. కొత్త అవకాశాల సృష్టి, మనుషుల ఉత్పాదకతను పెంచే సామర్థ్యం ఏఐకి ఉందని తెలిపారు. 1970ల్లోనూ ఇదేతరహా అపోహలు వినిపించాయని గుర్తుచేశారు. ‘కేస్‌ టూల్స్‌’ అనే కంప్యూటర్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ టూల్స్‌ వచ్చినప్పుడు అనేక భయాలు వ్యాపించాయని తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లో ఉద్యోగాలు ఊడిపోతాయనే ప్రచారం జరిగిందని వెల్లడించారు. కానీ, రానురానూ మరింత క్లిష్టమైన సమస్యలు మనుషులకు ఎదురయ్యాయని.. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంకా అభివృద్ధి చెందిందని వివరించారు.

ప్రపంచంలో ఎక్కడ ఏ ఆవిష్కరణ జరిగినా భారత్‌ దాన్ని వినియోగించుకునే సామర్థ్యాన్ని అందుపుచ్చుకుందని మూర్తి (Narayana Murthy) తెలిపారు. జనరేటివ్‌ ఏఐను అందుకు ఉదాహరణగా చెప్పారు. ఇప్పటి యువత పాత తరాలతో పోలిస్తే చాలా చురుగ్గా ఉన్నారని అన్నారు. ఏఐ వల్ల అటానమస్‌ డ్రైవింగ్‌, న్యూక్లియర్‌ రియాక్టర్ల వంటి ప్రమాదకరమైన ప్రాంతాల్లో మెషీన్‌ ఆపరేటర్లు, రిమోట్‌ సర్జరీ వంటి రంగాల్లోని ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం తప్పకపోవచ్చునని తెలిపారు. ఉద్యోగాలు పోతాయనే ఆలోచనల నుంచి బయటకు వచ్చి దాన్ని ఎంత సమర్థంగా ఉపయోగించగలమనే విషయంపైకి చర్చను మళ్లించాలని మూర్తి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని