ఘోరం.. 24 గంటల వ్యవధిలో 9 మంది శిశువులు మృతి..!

పశ్చిమ్ బెంగాల్‌(West Bengal)లోని ఓ ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఒకరోజు వ్యవధిలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. 

Published : 08 Dec 2023 16:20 IST

కోల్‌కతా: 24 గంటల వ్యవధిలో 9 మంది శిశువులు(newborns) మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. వారితో పాటు రెండేళ్ల చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయింది. పశ్చిమ్ బెంగాల్‌( West Bengal)లోని ముర్షిదాబాద్ వైద్య కళాశాలలో(Bengal hospital) ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దీనిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ మరణాలకు గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసింది. 

ప్రాథమిక నివేదిక ప్రకారం.. ఆ చిన్నారులంతా పోషకాహార లోపం, అతి తక్కువ బరువుతో ఉన్నారని, ఒకరు తీవ్రమైన హృద్రోగ సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిసింది. మృతి చెందిన శిశువుల్లో ముగ్గురు ముర్షిదాబాద్ వైద్య కళాశాలలో జన్మించారని, మిగిలిన శిశువుల్ని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడకు తీసుకువచ్చారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అప్పుడు వారికి ఆరోగ్యం క్షీణించిందని, మెరుగైన చికిత్స నిమిత్తం ఇక్కడకు తరలించారని పేర్కొన్నాయి. అలాంటి కేసుల్లో చికిత్స కోసం కొంచెం సమయం కావాలని, కానీ అప్పటికే సమయం మించిపోయిందని చెప్పాయి. జాంగిపుర్ సబ్‌ డివిజినల్ ఆసుపత్రిలో కొద్దిరోజులుగా పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, దాంతో చిన్నారులను ముర్షిదాబాద్‌కు రిఫర్ చేశారని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు.

రోడ్డు వేసి.. నకిలీ టోల్‌ ప్లాజా కట్టి.. ₹కోట్లు కొట్టేసి: గుజరాత్‌లో ఘరానా మోసం

గత నెల రోజుల వ్యవధిలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 380 మంది శిశువులను మెరుగైన చికిత్స నిమిత్తం ముర్షిదాబాద్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు వెల్లడించారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి నివేదికను వైద్యశాఖ ఉన్నతాధికారులకు పంపినట్లు తెలుస్తోంది. కాగా పసిపిల్లల మృతి వార్త స్థానికంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న తమ పిల్లల క్షేమం పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని