Nirmala Sitharaman: ద్రవ్యోల్బణం నియంత్రణకు స్థిర విధానాలు అవలంబిస్తున్నాం : సీతారామన్‌

విద్య, వైద్య రంగాల్లో పెట్టుబడులపై దృష్టి పెట్టడమే భారత్‌ ప్రాధాన్యత అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. దిల్లీలో నిర్వహించిన బీ20 సదస్సులో ఆమె మాట్లాడారు.

Published : 25 Aug 2023 18:38 IST

దిల్లీ: గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు ఉత్తమ ఫలితాలనిచ్చాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) అన్నారు. గత ప్రభుత్వాలు కూడా సంస్కరణలు తీసుకొచ్చాయని, కానీ, అవి అస్తవ్యస్తంగా ఉండేవని విమర్శించారు. కొవిడ్‌ మహమ్మారి సమయంలోనూ సంస్కరణల అమలును నిలిపివేయలేదని ఆమె తెలిపారు. దిల్లీలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న బీ20 (B20 Summit) సదస్సులో కేంద్రమంత్రి  ప్రసంగించారు. భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని గుర్తు చేస్తూ.. దేశంలో పెట్టుబడులు బలంగా ఉన్నాయన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడీపీ తొలి త్రైమాసిక ఫలితాలు త్వరలోనే వస్తాయని అన్నారు. అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

‘‘ గత ప్రభుత్వాలు కూడా సంస్కరణలు తీసుకొచ్చాయి. కానీ, వాటి ఫలితాల్లో స్థిరత్వం లేదు. గత తొమ్మిదేళ్లలో తీసుకొచ్చిన సంస్కరణలు స్థిరమైన ఫలితాలనిచ్చాయి. కొవిడ్‌ సమయంలోనూ సంస్కరణలు చేపట్టాం. వాటిని సవాలుగా కాకుండా అవకాశంగా భావించాం’’ అని సీతారామన్‌ అన్నారు. కొవిడ్‌ కాలం నాటి పరిస్థితులను గుర్తు చేసిన సీతారామన్‌.. విద్య, వైద్య రంగంగాల్లో పెట్టుబడులపై దృష్టిపెట్టడమే భారత్‌ ప్రాధాన్యత అని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ దీనిపై దృష్టి సారించాలన్నారు. లేదంటే అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఆరోగ్య వ్యవస్థలు పూర్తిగా దెబ్బతింటాయని హెచ్చరించారు. ఈ రంగాన్ని బలోపేతం చేసుకోకపోతే.. ఆరోగ్య సంక్షోభ పరిస్థితులు తలెత్తే ప్రమాదముందన్నారు.

బ్యాడ్మింటన్‌ ఆడుతున్న లాలూకు బెయిల్ ఎందుకు?: సీబీఐ

మరోవైపు దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు, ప్రభుత్వ రాబడిని పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం స్థిరమైన విధానాలను అవలంబిస్తోందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అలాగని పన్నులు పెంచేసి ప్రజలపై భారం పెట్టే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. ధరలు పెంచినంత మాత్రాన ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా నియంత్రించలేమని అన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే క్రమంలో బ్యాంకులు వృద్ధిని కూడా దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలన్నారు. టమాటా, కూరగాయల ధరల పెరుగుదలతో రిటైల్‌ ద్రవ్యోల్బణం జులై నెలలో 7.44శాతం ఎగబాకి 15 నెలల గరిష్ఠానికి చేరుకున్న సంగతి తెలిసిందే. బిజినెస్‌ 20 లేదా బీ20 అనేది జీ20 చర్చావేదికల్లో (ఫోరమ్‌) ఒకటి. గ్లోబల్‌ బిజినెస్‌ కమ్యూనిటీకి ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. 2010లో దీనిని ఏర్పాటు చేశారు. జీ20 సదస్సు సెప్టెంబరు నెలలో దిల్లీ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని