Nirmala Sitharaman: ప్రత్యేక దేశం వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ ఎంపీపై నిర్మలమ్మ ఫైర్‌

భారత్‌లో ప్రత్యేక దేశం కోసం డిమాండ్‌ వస్తుందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేశ్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫైర్‌ అయ్యారు. 

Updated : 29 Feb 2024 14:05 IST

బెంగళూరు: దేశ విభజన వ్యాఖ్యలు చేసిన కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేశ్‌పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీతారామన్‌ నిధుల కేటాయింపుపై వివరణ ఇచ్చారు.

బడ్జెట్‌ కేటాయింపుల్లో తమకు అన్యాయం జరుగుతోందని, ఇదే కొనసాగితే.. దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ పెరుగుతుందని ఇటీవల సురేశ్‌ వ్యాఖ్యానించడం దుమారానికి దారి తీసింది. దీనిపై నిర్మలమ్మ స్పందిస్తూ.. ‘‘నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్‌ కమిషన్‌కు కట్టుబడి ఉంది. దాని పాత్ర అంతవరకే ఉంటుంది. ఒక వేళ నిధులు పొందాలనుకుంటే కమిషన్‌కు రాష్ట్రాలు తమ సమస్యలు చెప్పుకోవాల్సి ఉంటుంది. అప్పుడు నిధులు మంజూరు అవుతాయి. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో బలం ఉంటుంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలను వేరుగా పరిగణించలేము. వాటన్నింటిని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయడమన్న డిమాండ్‌ ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘సందేశ్‌ఖాలీ’ నిందితుడు షాజహాన్‌ షేక్‌ అరెస్టు

‘‘దక్షిణాది రాష్ట్రాలు ఇండెక్స్‌లో మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. రాష్ట్రానికి ఎక్కువగా నిధులు కావాలంటే కమిషన్‌ను సంప్రదించాల్సిందే. మీరు ఒక బాధ్యతాయుతమైన పార్లమెంట్‌ సభ్యుడిగా ఉంటూ దేశ విభజన డిమాండ్‌ చేస్తున్నారు. మీ వ్యాఖ్యలు తప్పు’’ అని నిర్మలమ్మ పేర్కొన్నారు. ఈ అంశంపై ఇటీవల పార్లమెంట్‌ దద్దరిల్లింది. సురేశ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి డిమాండ్‌ చేశారు. అనంతరం హస్తం పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున స్పందిస్తూ.. దేశాన్ని ఒక్కటిగా ఉంచాలనేదే కాంగ్రెస్‌ సిద్ధాంతమని, విభజన కోరే వారికి పార్టీ ఎప్పటికీ మద్దతు తెలపదని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని