Nirmala Sitharaman: ఎలక్టోరల్‌ బాండ్లపై స్పందించిన నిర్మలా సీతారామన్‌

Electoral Bonds: ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. ఈడీ, సీబీఐ దాడుల తర్వాతే కొన్ని కంపెనీలు బాండ్లు కొనుగోలు చేశాయని అనుకోవడం ఊహాగానమే అవుతుందని పేర్కొన్నారు.

Updated : 15 Mar 2024 13:45 IST

Electoral Bonds | దిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్లకు (Electoral Bonds) సంబంధించిన వివరాలు బహిర్గతం అయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించగా.. వాటిని ఈసీ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అయితే, ఎలక్టోరల్‌ బాండ్లు కొనుగోలు చేసిన కొన్ని సంస్థలపై గతంలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయని పలువురు గుర్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక  మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) స్పందించారు. ‘ఇండియా టుడే’ నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో దీనిపై మాట్లాడారు.

విరాళాలకు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల దాడులకు సంబంధం ఉందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఊహాగానం అంటూ నిర్మలా సీతారామన్‌ కొట్టి పారేశారు. ‘‘ఈడీ.. కంపెనీల తలుపులు తడితే తమను తాము రక్షించుకోవడానికి ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశారనుకోవడం ఊహాగానమే అవుతుంది. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన తర్వాత కూడా ఈడీ దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి కదా! దాన్నేమనాలి?’’ అని ఆమె ప్రశ్నించారు.

ఎన్నికల బాండ్ల పూర్తి డేటా ఎందుకు ఇవ్వలేదు?: SBIపై సుప్రీం ఆగ్రహం

‘‘ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాలు మొత్తం భాజపాకే వెళ్లాయని చాలా మంది భావిస్తున్నారు. భాజపాతో పాటు కొన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా వెళ్లాయి కదా!’’ అని సీతారామన్‌ అన్నారు. పూర్తి వివరాలు సమర్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించించడం గురించి ప్రస్తావించగా.. ప్రస్తుతం ఆ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. కోర్టు అడిగిన వివరాల సంగతి ఎస్‌బీఐ చూసుకుంటుందన్నారు.

ఎన్నికల బాండ్ల స్కీమ్‌ గురించి మాట్లాడతూ.. గత వ్యవస్థలోనూ లోపాలు ఉన్నాయి కదా అని నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు. తనకంటే ముందు ఆర్థిక మంత్రిగా పనిచేసిన అరుణ్‌జైట్లీ మునుపటి కంటే మెరుగైనదిగా భావించి ఈ ఎలక్టోరల్‌ బాండ్ల స్కీమ్‌ను తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు కొనుగోలు చేసిన బాండ్లు నేరుగా రాజకీయ పార్టీల ఖాతాల్లోనే పడుతున్నాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని