Electoral bonds: ఎన్నికల బాండ్ల పూర్తి డేటా ఎందుకు ఇవ్వలేదు?: SBIపై సుప్రీం ఆగ్రహం

Electoral bonds: ఎన్నికల బాండ్లపై పూర్తి వివరాలను ఎస్‌బీఐ.. ఈసీకి ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు బ్యాంకుకు నోటీసులు జారీ చేసింది.

Updated : 15 Mar 2024 12:14 IST

దిల్లీ: ఎన్నికల బాండ్ల (Electoral bonds) వ్యవహారంలో భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (SBI)పై సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం బాండ్ల పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి (EC) ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. దీనిపై ఆ బ్యాంక్‌కు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది.

ఎన్నికల బాండ్లపై కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. బాండ్ల ఆల్ఫా న్యూమరిక్‌ నంబర్లను ఎస్‌బీఐ తమకు సమర్పించలేదని ఈసీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో బ్యాంకుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.  ‘‘బాండ్ల నంబర్లు లేకపోవడంతో ఎవరు ఎవరికి ఎంత ఇచ్చారన్నది స్పష్టంగా తెలియడం లేదు. అన్ని వివరాలను వెల్లడించాలని మేం తీర్పులోనే పేర్కొన్నా.. మీరు ఎందుకు ఇవ్వలేదు’’ అని కోర్టు ప్రశ్నించింది.

దీనిపై బ్యాంక్‌కు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది. ఆలోగా తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఎస్‌బీఐని ఆదేశించింది. ఎన్నికల బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను సోమవారం నాటికి ఈసీకి అందజేయాలని స్పష్టం చేసింది. బాండ్ల నంబర్లతో రాజకీయ పార్టీలకు ఏ దాత ఎంత విరాళం ఇచ్చారనేది తెలుస్తుంది.

విరాళాల్లో.. ధారాళం: ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించిన ఈసీ

ఎన్నికల బాండ్లపై మార్చి 11న ఇచ్చిన తీర్పును కొంత సవరించాలని కోరుతూ ఎన్నికల సంఘం ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. 2019 ఏప్రిల్‌ 12వ తేదీకి ముందు జారీ అయిన బాండ్లు, వాటిని ఎన్‌క్యాష్‌ చేసుకున్న రాజకీయ పార్టీల వివరాలను సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈసీ గతంలో రెండు సార్లు సీల్డ్‌ కవర్‌లో సమర్పించింది. అయితే, ఇటీవల ఏప్రిల్‌ 19 నుంచి ఫిబ్రవరి 15 వరకు గత ఐదేళ్లలో జారీ చేసిన బాండ్ల వివరాలను ఈసీకి అందజేయాలని ఎస్‌బీఐని ఆదేశించిన సుప్రీం.. అంతకంటే ముందు నాటి బాండ్ల వివరాలను కూడా బహిర్గతం చేయాలని ఈసీకి సూచించింది.

ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం కోర్టుకు ఆశ్రయించింది. ‘‘గోప్యతను పాటించేందుకు నాటి బాండ్ల డాక్యుమెంట్లను మేం సీల్డ్‌ కవర్‌లో సమర్పించాం. వాటికి సంబంధించి ఇప్పుడు మా వద్ద ఎలాంటి కాపీలు లేవు. వాటిని తిరిగి ఇవ్వండి’’ అని అభ్యర్థించింది. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. గతంలో ఈసీ ఇచ్చిన వివరాలను స్కాన్‌ చేసి డిజిటలైజ్‌ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఆ తర్వాత ఒరిజినల్‌ డాక్యుమెంట్లను ఈసీకి ఇవ్వాలని సూచించింది. వాటిని శనివారం సాయంత్రం 5 గంటల్లోపు వెబ్‌సైట్‌లో బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని