Nirmala Sitharaman: ఆ దారుణాలపై మాట్లాడుతుంటే వణుకువస్తోంది: నిర్మలమ్మ

సందేశ్‌ఖాలీలో నెలకొన్న పరిస్థితిని ఎత్తి చూపుతూ మమతా బెనర్జీ సర్కారుపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శలు గుప్పించారు.

Published : 28 Feb 2024 12:38 IST

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారంలోని పశ్చిమ బెంగాల్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందంటూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్నారు. కోల్‌కతాలో భాజపా అనుబంధ సాంస్కృతిక బృందం ఖోలా హవా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె దీదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

‘‘టీఎంసీ హయాంలో రాష్ట్రంలో అవినీతి, అశాంతి, దోపిడీ రాజ్యమేలుతున్నాయి. సందేశ్‌ఖాలీ దారుణాల గురించి మాట్లాడుతుంటే నాకు వణుకు పుడుతోంది. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వం దోషులను అరెస్టు చేయడం లేదు. మణిపుర్‌ అంశంపై వారు పార్లమెంట్‌లో ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తారో గుర్తుంది. కానీ, ప్రస్తుతం సందేశ్‌ఖాలీలో జరుగుతుంది ఏంటి..?మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడి, వారి భూములను ఆక్రమించిన నిందితుడు, టీఎంసీ నేత షాజహాన్‌ షేక్‌ ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసు. లేదంటే వారం రోజుల్లో అరెస్టు చేస్తామని ఎలా చెప్పగలిగారు?’’ అని దీదీ సర్కారును ప్రశ్నించారు.

గగన్‌యాన్‌ వ్యోమగామి నా భర్తే.. వెల్లడించిన ప్రముఖ నటి

తమ మంత్రులను తప్ప ఇతరులను సందేశ్‌ఖాలీని సందర్శించేందుకు టీఎంసీ ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGA) నిధులను కేంద్రం వెనక్కు తీసుకుంటోందని సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలకు ఆమె ఈ సందర్భంగా బదులిచ్చారు. రాష్ట్రంలో 25 లక్షల మందికి నకిలీ జాబ్‌ కార్డులున్నాయని.. అలాంటప్పుడు కేంద్రం నిధులను ఎలా విడుదల చేయగలదన్నారు. ఇది ప్రజల సొమ్ము.. ప్రైవేట్‌ ఆస్తి కాదంటూ దుయ్యబట్టారు. తమ రాజకీయాల ద్వారా టీఎంసీ ప్రభుత్వం రాష్ట్రంలో ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు