Nitish Kumar: శాశ్వతంగా ఎన్డీయేలోనే.. ప్రధాని సాక్షిగా నీతీశ్‌ హామీ

ఇకపై కూటమి మారబోనని.. శాశ్వతంగా ఎన్డీయేలోనే ఉంటానని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ అన్నారు.

Updated : 02 Mar 2024 21:17 IST

పట్నా: ఇకపై కూటమి మారబోయేది లేదని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) అన్నారు. తాను ఎన్డీయే (NDA)లోనే ఉంటానని ప్రధాని మోదీ (PM Modi) సాక్షిగా ఆయన హామీ ఇచ్చారు. ఔరంగబాద్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో మోదీతో పాటు పాల్గొన్న నీతీశ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘గతంలో కూటమి (ఇండియా కూటమిని ఉద్దేశిస్తూ)కి ఆ పేరు పెట్టేందుకు నిరాకరించా. అయినప్పటికీ వారు దాన్నే ఖరారు చేశారు. ఈ కారణాలతో తిరిగి ఎన్డీయే గూటికి చేరా. ఇప్పటికీ సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కిరాలేదు. గతంలో ఎన్నోసార్లు ప్రధాని ఇక్కడికి వచ్చారు. ఈసారి మీతో కలిసి ఉన్నందుకు నేనేంతో అదృష్టవంతుడిని. శాశ్వతంగా కూటమి మారకుండా.. మీతోనే కలిసి నడుస్తా. బిహార్‌ అభివృద్ధికి కృషి చేస్తా’’ అని ప్రధానితో నీతీశ్‌ అన్నారు.

భాజపా తొలి జాబితాలో.. కంగనా రనౌత్, అక్షయ్‌ కుమార్‌..?

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేసిన ప్రధాని ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. నేడు బిహార్‌కు చేరుకున్న ఆయన రూ.21,400 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. తనకు వేయబోయిన పూలమాలను నీతీశ్‌తో కలిసి పంచుకున్నారు. నీతీశ్‌కుమార్‌ ఎన్డీయేతో పొత్తు కుదుర్చుకుని సీఎం పీఠమెక్కిన తర్వాత మోదీ రాష్ట్రంలో చేసిన తొలి పర్యటన ఇదే.

ఆ నేతలు భయపడుతున్నారు: ప్రధాని మోదీ

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ‘వంశ పాలకులు’ భయపడుతున్నారని, అందుకే పార్లమెంటులో అడుగుపెట్టేందుకు రాజ్యసభ దారులు వెతుకుతున్నారని విపక్షాలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. వంశ పాలనలో మునిగిపోయి, ప్రజల మనసుల్లో భయాందోళనలు సృష్టించిన వారిని ఎన్డీయే కూటమి కట్టడి చేసిందని.. రాష్ట్రంలో ‘కాంగ్రెస్- ఆర్జేడీ’ దోస్తీని ఉద్దేశించి విమర్శలు చేశారు. బిహార్‌లో అభివృద్ధి, చట్టబద్ధమైన పాలన, మహిళలకు భద్రత తన ‘గ్యారంటీ’ అని చెప్పారు. మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్‌కు ‘భారత రత్న’ లభించడం మొత్తం బిహార్‌కు దక్కిన గౌరవమని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని