Nipah Virus: కేరళలో ‘బంగ్లాదేశ్‌ వేరియంట్‌’ కలవరం.. ఆ గ్రామాల్లో స్కూళ్లు, బ్యాంకుల మూసివేత..

ప్రమాదకర నిఫా వైరస్‌ (Nipah Virus) వెలుగు చూడడంతో అప్రమత్తమైన కేరళ.. 7 గ్రామాల్లో కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి పాఠశాలలు, బ్యాంకులు మూసివేసింది.

Updated : 13 Sep 2023 16:58 IST

తిరువనంతపురం: అత్యంత ప్రమాదకర నిఫా వైరస్‌ (Nipah Virus) వెలుగు చూడడంతో కేరళ మరోసారి అప్రమత్తమైంది. ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో వైరస్‌ కట్టడి చర్యలకు ఉపక్రమించిన అధికారులు.. 7 గ్రామాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. ముందు జాగ్రత్తగా అక్కడి బ్యాంకులు, పాఠశాలతోపాటు ఇతర విద్యాసంస్థలను మూసివేశారు. ప్రస్తుతం వెలుగు చూసిన నిఫా వైరస్‌ బంగ్లాదేశ్‌ వేరియంట్‌ (Bangladesh variant) అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

మరణాల రేటు (Mortality Rate) అధికంగా ఉండే ఈ వైరస్‌ నిర్ధారణను వేగవంతంగా చేపట్టేందుకు గాను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (NIV) నిపుణులు కేరళకు బయలుదేరారు. కోజికోడ్‌లోని మెడికల్‌ కాలేజీలో మొబైల్‌ క్యాంపును ఏర్పాటు చేసి పరీక్షలు చేయనున్నట్లు కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరితోపాటు చెన్నైలోని ఐసీఎంఆర్‌ ఎపిడమిక్‌ బృందాలు కూడా అక్కడికి చేరకొని సర్వే నిర్వహిస్తాయని పేర్కొంది. రాష్ట్రంలో నిఫా కేసులు వెలుగు చూడటంపై ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీనాజార్జ్‌ స్పందించారు. రాష్ట్రంలో ప్రస్తుతం బయటపడిన నిఫా కేసు బంగ్లాదేశ్‌ వేరియంట్‌ అని పేర్కొన్నారు. ఇది మనుషుల మధ్య వ్యాపించగలదని, వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ మరణాల రేటు (Mortality Rate) అధికమని చెప్పారు. ఇప్పటివరకు నాలుగు కేసులు వెలుగు చూడగా.. అందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో బాధితులకు సన్నిహితంగా మెలిగిన 130మందిని గుర్తించి పరీక్షించినట్లు సమాచారం.

నిఫా.. వ్యాప్తిని అడ్డుకోవడమే ఏకైక మార్గం..!

మెదడును అత్యంత తీవ్రంగా దెబ్బతీసే నిఫా వైరస్‌ను 1999లో తొలిసారి గుర్తించారు. మలేసియా, సింగపూర్‌లోని పందుల పెంపకందారుల్లో ఈ ఇన్‌ఫెక్షన్‌ను కనుగొన్నారు. కేరళలో ఈ వైరస్‌ 2018లో తొలిసారి వెలుగు చూసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు వ్యాప్తిలోకి వచ్చింది. 23 మందికి వైరస్‌ నిర్ధారణ కాగా అందులో 21 మంది ప్రాణాలు కోల్పోయారంటే అదెంతో ప్రాణాంతకమో అర్థం చేసుకోవచ్చు. 2019, 2021ల్లోనూ ఇద్దరు బాధితులు మరణించారు.

మరోవైపు, నిఫా వైరస్‌కు ప్రత్యేకమైన టీకాలు, చికిత్స లేకపోవటం భయాలను మరింత పెంచుతున్నాయి. కొవిడ్‌తో పోలిస్తే నిఫా వైరస్‌ అత్యంత ప్రమాదకరమైంది. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ముఖ్యంగా రక్తం, మూత్రం, ముక్కు, నోటి నుంచి వచ్చే స్రావాల్లో వైరస్‌ ఉంటుంది. వ్యాధి సోకిన వ్యక్తితో.. సన్నిహితంగా మెలిగిన ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులకే నిఫా వైరస్‌ సోకుతోంది. నిఫా వైరస్‌లోని ప్రోటీన్లు మెదడు, కేంద్ర నాడీకణాల్లోనే కేంద్రీకృతమవుతాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని