Arvind Kejriwal: కేజ్రీవాల్‌.. జైలునుంచి పాలన సాధ్యమేనా..?

జైల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు రాజ్యాంగం, చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ.. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం ఆచరణాత్మకంగా అసాధ్యమని న్యాయనిపుణులు చెప్పారు.

Published : 02 Apr 2024 00:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు కోర్టు 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను తిహాడ్‌ జైలుకు తరలించారు. ప్రస్తుతం సీఎం పదవిలోనే కొనసాగుతోన్న కేజ్రీవాల్‌.. ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు పాలనాపర ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కారాగారానికి తరలించిన నేపథ్యంలో.. సీఎంగా కొనసాగడం, పాలనాపర వ్యవహారాలు నిర్వహించడం కుదురుతుందా? అనే ప్రశ్నలు ఉత్నన్నమవుతున్నాయి. రాజ్యాంగం, చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ.. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదని న్యాయనిపుణులు చెప్పారు.

‘‘జైల్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడాన్ని నిషేధించే నిర్దిష్ట నిబంధనేదీ రాజ్యాంగంలో లేదు. అయితే.. విధుల నిర్వహణ ఆచరణాత్మకంగా అసాధ్యం’’ అని సీనియర్ న్యాయవాది అజిత్ సిన్హా తెలిపారు. సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ సైతం ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి చెరసాలకు వెళ్లే సందర్భాన్ని రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండరని, అందుకే ఈ వ్యవహారానికి సంబంధించిన నిబంధనలు పొందుపర్చలేదేమోనని తెలిపారు.

తిహాడ్‌ జైలు నంబరు 2లో కేజ్రీవాల్‌.. డైలీ రొటీన్‌ ఇదే..!

‘‘కారాగారం నుంచి ప్రభుత్వ నిర్వహణ కష్టం. ప్రభుత్వాధినేతగా చేపట్టే ప్రతీ పనికి.. కోర్టు, అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ క్యాబినెట్‌ను సమావేశపర్చడం కుదరదు. మంత్రివర్గ నిర్ణయాలు తీసుకోవడం, అధికారిక పత్రాలపై సంతకాలు చేయడం, బదిలీ ఉత్తర్వుల వంటి రోజువారీ పాలనాపర కార్యకలాపాల నిర్వహణ అసాధ్యం. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ కూడా తాను అరెస్టయినప్పుడు.. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపొచ్చనే అభిప్రాయంతో ఉన్నారు. ఆ తర్వాత తన సతీమణి రబ్రీ దేవీని సీఎం చేశారు’’ అని వికాస్‌ సింగ్‌ గుర్తుచేశారు.

కారాగారం నుంచి పాలన అత్యంత సవాలుతో కూడుకున్న వ్యవహారమని తీహాడ్‌ జైలు మాజీ పీఆర్వో సునీల్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. ‘‘దిల్లీలోని 16 జైళ్లలో ఒక్కదాంట్లోనూ సీఎం విధుల నిర్వహణకు అనువైన సౌకర్యాలు లేవు. దీని కోసం అన్ని నిబంధనలను పక్కనపెట్టాల్సి ఉంటుంది. అయితే.. దీనికి ఎవరూ అనుమతించరు. మంత్రులు, ఎల్జీ, సిబ్బందితో సమావేశాలు, టెలిఫోన్ సంభాషణలు అవసరం. తిహాడ్‌ జైలుకు టెలిఫోన్ సౌకర్యం కూడా లేదు. అక్కడ సీఎం కార్యాలయం ఏర్పాటు అసాధ్యం’’ అని ఓ వార్తాసంస్థతో గుప్తా తెలిపారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని ఇటీవల దిల్లీ హైకోర్టు కూడా స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని