Rahul Gandhi: సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్‌ క్లారిటీ

Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్‌ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు.

Updated : 24 Apr 2024 13:44 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ (Congress) ప్రకటించిన మేనిఫెస్టోలో ‘దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక సర్వే’ హామీ రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా ‘పునఃపంపిణీ’ చేస్తామని కాంగ్రెస్‌ చెబుతోందంటూ ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో ఈ అంశం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) దీనిపై స్పందిస్తూ తమ హామీపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

దిల్లీలో జరిగిన పార్టీ సామాజిక న్యాయ సమ్మేళన్‌ కార్యక్రమంలో రాహుల్‌ ఈ వివాదాన్ని ప్రస్తావించారు. ‘‘ఈ సర్వే అనంతరం చర్యలు తీసుకుంటామని మేం చెప్పలేదు. కేవలం ఈ దేశంలో ఎంతమందికి అన్యాయం జరిగిందనేదాన్ని తెలుసుకునేందుకే సర్వే చేస్తామని అంటున్నాం. అన్యాయం గురించి నేను మాట్లాడగానే ప్రధాని మోదీ ఎలా స్పందించారో చూడండి. దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నామంటూ మాపై నిందలు వేస్తున్నారు. కానీ ఈ సర్వేతో అసలు సమస్య ఏంటో, ఎక్కడుందో అర్థమవుతుంది. దేశభక్తులం అని చెప్పుకొనేవారు.. సామాజిక-ఆర్థిక సర్వేతో కూడిన కులగణనకు భయపడుతున్నారు’’ అని రాహుల్‌ దుయ్యబట్టారు.

‘సంపద స్వాధీనం’పై శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్‌

కులగణనను ఏ శక్తీ ఆపలేదని, వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ తొలి నిర్ణయం దీని మీదే ఉంటుందని చెప్పారు. ఈ దేశంలో అన్యాయానికి గురైన 90శాతం మందికి న్యాయం కల్పించడమే తమ జీవిత ధ్యేయమని తెలిపారు.

మోదీ స్నేహితుల రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ..

ప్రధాని మోదీపై రాహుల్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని తన బిలియనీర్‌ స్నేహితులు తీసుకున్న రూ.16లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని ఆరోపించారు. దేశం ఎప్పటికీ ఆయనను క్షమించదని అన్నారు. ‘‘రూ.16లక్షల కోట్లు.. ఈ డబ్బుతో 16 కోట్ల మంది యువతకు ఏడాదికి లక్ష జీతంతో ఉద్యోగాలు ఇవ్వొచ్చు. 16 కోట్ల మంది మహిళలకు ఏడాదికి రూ.లక్ష ఇస్తే వారి జీవితాలు మారిపోయేవి. ఇదే రుణమాఫీ రైతులకు చేస్తే ఎన్నో ఆత్మహత్యలను అరికట్టేవాళ్లం.  ఈ డబ్బుతో దేశం మొత్తానికి 20 ఏళ్ల పాటు రూ.400లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వొచ్చు. దేశ పౌరుల బాధలు తీర్చడానికి బదులు.. ప్రధాని తమ స్నేహితులకు లాభం చేకూర్చారు’’ అని రాహుల్‌ మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని