No govt Job: అత్యాచార నిందితులకు ‘నో గవర్నమెంట్‌ జాబ్‌’

లైంగిక నేర చరిత్ర కలిగిన వారికి ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదని రాజస్థాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం అశోక్‌ గహ్లోత్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

Updated : 08 Aug 2023 20:35 IST

జైపుర్‌: రాష్ట్రంలో మహిళపై జరుగుతున్న నేరాలను అణిచివేసేందుకు రాజస్థాన్‌ (Rajasthan) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాచార ఘటనలకు పాల్పడిన వారికి, గతంలో ఇలాంటి చరిత్ర ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot) ప్రకటించారు. ‘‘ మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారికి, ఆయా ఘటనలతో ప్రమేయం ఉన్నవారికి, లైంగిక దుష్ప్రవర్తన కలిగిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది’’ అని సీఎం అశోక్‌ గహ్లోత్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

మహిళా పోలీసుకు 300 కాల్స్‌.. కటకటాల పాలయ్యాడు!

దీనికోసం ప్రతి పోలీస్‌స్టేషన్‌లో లైంగిక నేరస్థుల జాబితాను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉద్యోగానికి ఎంపిక చేసే ముందు స్థానిక పోలీస్‌స్టేషన్లు లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నడవడిక ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. రాజస్థాన్‌లో మహిళలపై లైంగిక నేరాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయంటూ భాజపా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో అశోక్‌ గహ్లోత్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. రాజస్థాన్‌లో ఇటీవల మహిళలపై వరుస లైంగిక దాడులు చోటు చేసుకోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది

ఇటీవల 14 ఏళ్ల బాలికను హతమార్చి మృతదేహాన్ని ఇటుకబట్టీలో వేసి కాల్చేసిన ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. హత్యకు ముందు ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఏడుగురు నిందితులను అరెస్టు చేసింది. వీలైనంత తొందరగా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసి నిందితులకు చట్టప్రకారం కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ‘‘ ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీలైనంత త్వరగా శిక్ష పడేలా చేసేందుకు కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు అప్పగించాం.’’ అని అశోక్‌ గహ్లోత్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. అంతకు ముందు రాజస్థాన్‌ మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు మానవత్వం మర్చిపోయి ప్రవర్తించారని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని