Woman Police: మహిళా పోలీసుకు 300 కాల్స్‌.. కటకటాల పాలయ్యాడు!

ఓ మహిళా కానిస్టేబుల్‌కు పదేపదే ఫోన్‌ చేసి విసిగించిన నిందితుడికి కేరళ న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.15వేల జరిమానా విధించింది.

Updated : 08 Aug 2023 20:29 IST

తిరువనంతపురం: సాధారణంగా అత్యవసర సమయాల్లోనే పోలీసులకు (Police) ఫోన్‌ చేస్తాం. కానీ, కేరళకు (Kerala) చెందిన యువకుడు ఓ మహిళా పోలీసుకు పదేపదే ఫోన్‌ చేసి విసిగించాడు. అలాగని ఆమె వ్యక్తిగత నెంబర్‌కు అనుకునేరు. కాదు..కాదు.. నేరుగా పోలీస్‌స్టేషన్‌కే ఫోన్‌ చేసి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. లైంగిక విషయాల్లో సాయం చేయాలని అభ్యర్థించేవాడు. ఇలా ఒకట్రెండు కాదు.. ఏకంగా 300సార్లు కేరళలోని కోచి పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేశాడు. ఇలా చేయడం వల్ల సదరు పోలీస్‌ అధికారిణితోపాటు, స్టేషన్‌లోని ఇతర సిబ్బంది విధులకూ తీవ్ర ఆటంకం కలిగేది. విసుగెత్తిపోయిన పోలీసులు నిందితుడిని గుర్తించి, అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. 

లంచం కోసం ‘మంత్రి’ ఒత్తిడి.. కన్నడనాట ‘లేఖ’ కలకలం..!

తాజాగా దీనిపై విచారణ చేపట్టిన కేరళ కోర్టు అతడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాకుండా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు గానూ రూ.15వేల జరిమానా కూడా వేసింది. ఈ మేరకు ఎర్నాకులం అదనపు ఛీప్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ సాజిని బీఎస్‌ తీర్పు వెలువరించారు. ‘‘ వాదనలు విన్న తర్వాత నిందితుడి చర్యలు పోలీసు అధికారితోపాటు, స్టేషన్‌లోని ఇతర సిబ్బందికి చాలా తలనొప్పిగా మారాయని గమనించాం. నిందితుడు తరచూ ఫోన్‌ చేయడం వల్ల అత్యవసర సమయాల్లో పోలీసుల సాయం కోసం ప్రయత్నించిన ప్రజలు కూడా ఇబ్బంది పడే ఉంటారు. అంతేకాకుండా అధికారుల విధి నిర్వహణకు తీవ్ర ఆటంకం ఏర్పడినట్లు గుర్తించాం. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. అతడికి మూడేళ్ల కఠిన జైలుశిక్ష, రూ.15వేల జరిమానా విధించాం’’ అని న్యాయస్థానం తీర్పులో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని