Amit Shah: రామ మందిర నిర్మాణం జరుగుతుందని అనుకొని ఉండరు: అమిత్‌ షా

దేశ యువత కోసం బంగారు భవిష్యత్తు ఎదురుచూస్తోందని, గత పదేళ్లలో దేశంలో అవినీతి, బంధుప్రీతి, కులతత్వాన్ని అభివృద్ధి భర్తీ చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. 

Updated : 08 Dec 2023 16:49 IST

దిల్లీ: అయోధ్య (Ayodhya)లో రామ మందిర (Ram Mandir) నిర్మాణం జరుగుతుందని దేశంలో ఎవరూ అనుకొని ఉండరని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) అన్నారు. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, అభివృద్ధి అనేవి రెండు విరుద్ధమైన అంశాలు కాదని తెలిపారు. దిల్లీలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ABVP) 69వ జాతీయ సమావేశంలో అమిత్‌ షా పాల్గొన్నారు.

‘‘విద్య కేవలం కెరీర్‌ను రూపొందించుకోవడానికి మాత్రమే కాదు.. దేశ నిర్మాణానికి కూడా అవసరం. దేశ యువత కోసం బంగారు భవిష్యత్తు ఎదురుచూస్తోంది. గత పదేళ్లలో దేశంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అవినీతి, బంధుప్రీతి, కులతత్వాన్ని అభివృద్ధి భర్తీ చేసింది. యువ శక్తే దేశానికి వెన్నెముక. దేశాభివృద్ధిని ముందుకు నడిపేది వారే. పలు సమస్యల పరిష్కారం కోసం ప్రపంచం మొత్తం భారత్‌వైపు చూస్తోంది. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం, అభివృద్ధి రెండు విభిన్న అంశాలు కాదు. రామ మందిర నిర్మాణం జరుగుతుందని దేశంలో ఎవరూ అనుకొని ఉండరు’’ అని అమిత్‌ షా తెలిపారు. 

‘వెడ్‌ ఇన్‌ ఇండియా’ను మీరే ప్రారంభించాలి.. సంపన్న కుటుంబాలకు ప్రధాని మోదీ సూచన

మరోవైపు అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం తాజా ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర (Shri Ram Janmbhoomi Teerth Kshetra) ట్రస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది. రామ మందిర నిర్మాణం తుది దశకు చేరుకుందని తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆలయ నిర్వాహకులు అంతా సిద్ధం చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీని శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది. ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలతోపాటు సుమారు 6 వేల మంది సాధువులు, పూజారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని