G20: 200 గంటలు.. 300 సమావేశాలు.. 15 ముసాయిదాలు.. దిల్లీ డిక్లరేషన్‌ వెనుక భారీ కసరత్తు

G20 Summit: జీ20 న్యూదిల్లీ డిక్లరేషన్‌ వెనుక పెద్ద కసరత్తు జరిగినట్లు షెర్పా అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. దౌత్యవేత్తల బృందాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు.

Published : 10 Sep 2023 11:38 IST

దిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సులో నేతల మధ్య కుదిరిన దిల్లీ డిక్లరేషన్‌ (G20 Declaration)పై ఏకాభిప్రాయం సాధించడానికి భారత దౌత్యవేత్తల బృందం విశేష కృషి చేసినట్లు షెర్పా అమితాబ్‌ కాంత్‌ ఆదివారం తెలిపారు. దాదాపు 200 గంటల పాటు నిరంతర చర్చలు జరిపినట్లు వెల్లడించారు. అదనపు కార్యదర్శులైన ఈనం గంభీర్, కె.నాగరాజు నాయుడుతో కూడిన దౌత్యవేత్తల బృందం 300 ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించినట్లు తెలిపారు. వివాదాస్పద ఉక్రెయిన్ అంశంపై ఇతర దేశాల్లోని తమ సహచరులతో 15 ముసాయిదాలను పంచుకున్నట్లు వివరించారు. వీరందరి కృషి వల్లే జీ20 సదస్సు (G20 Summit) తొలిరోజే నేతల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమైందన్నారు.

"మొత్తం G20 సదస్సు (G20 Summit)లో అత్యంత సంక్లిష్టమైన భాగం భౌగోళిక రాజకీయాలపై (రష్యా-ఉక్రెయిన్) ఏకాభిప్రాయం తీసుకురావడం. ఇది 200 గంటల పాటు నిరంతర చర్చలు, 300 ద్వైపాక్షిక సమావేశాలు, 15 ముసాయిదాల వల్లే సాధ్యమైంది. నాగరాజు నాయుడు, గంభీర్ ఈ విషయంలో తనకు ఎంతో సహకరించారు’’ అని అమితాబ్‌ కాంత్‌ చెప్పారు.

అణు బెదిరింపులు తగవు

జీ20 కూటమి అధ్యక్ష హోదాలో భారత్‌ శనివారం పెద్ద విజయాన్ని నమోదు చేసింది. పలు అంశాలపై భాగస్వామ్య దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయాన్ని సాధించగలిగింది. ఉక్రెయిన్‌ యుద్ధం అంశంలో తలెత్తిన పీటముడిని చాకచక్యంగా పరిష్కరించగలిగింది. సంయుక్త ప్రకటనలో సంబంధిత పేరాను సవరించడం ద్వారా అన్ని దేశాల మద్దతును గెల్చుకోగలిగింది. దిల్లీలో జరుగుతున్న శిఖరాగ్ర సదస్సులో.. అధ్యక్ష స్థానంలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని