అణు బెదిరింపులు తగవు

జీ20 కూటమి అధ్యక్ష హోదాలో భారత్‌ శనివారం పెద్ద విజయాన్ని నమోదు చేసింది. పలు అంశాలపై భాగస్వామ్య దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయాన్ని సాధించగలిగింది.

Updated : 10 Sep 2023 08:33 IST

ఇది యుద్ధాల శకం కాదు
ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి
రష్యా పేరు ప్రస్తావించకుండా.. ఉక్రెయిన్‌ అంశంపై జీ20 స్పష్టీకరణ
వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచన
‘న్యూదిల్లీ డిక్లరేషన్‌’కు కూటమి ఆమోదం

దిల్లీ: జీ20 కూటమి అధ్యక్ష హోదాలో భారత్‌ శనివారం పెద్ద విజయాన్ని నమోదు చేసింది. పలు అంశాలపై భాగస్వామ్య దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయాన్ని సాధించగలిగింది. ఉక్రెయిన్‌ యుద్ధం అంశంలో తలెత్తిన పీటముడిని చాకచక్యంగా పరిష్కరించగలిగింది. సంయుక్త ప్రకటనలో సంబంధిత పేరాను సవరించడం ద్వారా అన్ని దేశాల మద్దతును గెల్చుకోగలిగింది. దిల్లీలో జరుగుతున్న శిఖరాగ్ర సదస్సులో.. అధ్యక్ష స్థానంలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన చేశారు. ‘‘మిత్రులారా.. మనందరికీ ఒక శుభవార్త. మా బృందాల శ్రమ, మీ అందరి సహకారం కారణంగా ‘న్యూదిల్లీ జీ20 లీడర్స్‌ డిక్లరేషన్‌’పై ఏభిప్రాయం వ్యక్తమైంది. ఈ డిక్లరేషన్‌ను ఆమోదిస్తున్నట్లు ప్రకటిస్తున్నా’’ అని పేర్కొన్నారు. దీన్ని సాకారం చేయడానికి కృషిచేసిన మంత్రులు, షెర్పాలు, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాజా సంయుక్త ప్రకటనలో రష్యా పేరును ప్రస్తావించకుండానే ఉక్రెయిన్‌ అంశంపై జీ20 కూటమి పలు సూచనలు చేసింది. అణు బెదిరింపులు తగవని, ఇది యుద్ధాల శకం కాదని స్పష్టంచేసింది. విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరింది.
గత ఏడాది ఇండోనేసియాలో బాలీ డిక్లరేషన్‌లో ఉక్రెయిన్‌ ఘర్షణ అంశంపై ప్రస్తావించిన రెండు పేరాలకు రష్యా, చైనా అంగీకారం తెలిపాయి. అయితే దానిపై ఈ ఏడాది ఆ రెండు దేశాలూ మాట మార్చాయి. ఈ పరిస్థితి భారత్‌కు సవాల్‌గా మారింది. దీనిపై ఈ నెల 3-6 తేదీల్లో హరియాణాలోని నుహ్‌లో జరిగిన షెర్పాల సమావేశంలోనూ జీ20 సభ్యదేశాల మధ్య అంగీకారం కుదరలేదు. ఉక్రెయిన్‌పై దాడులకు పాల్పడుతోన్న రష్యా చర్యను ఖండించాలని పశ్చిమ దేశాలు ఒత్తిడి చేస్తుండగా.. చైనా మద్దతుతో రష్యా మాత్రం దాన్ని చల్లార్చేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో తాజా శిఖరాగ్ర సదస్సులో సంయుక్త ప్రకటనపై సందిగ్ధత ఏర్పడింది. జీ20.. ఏకాభిప్రాయ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఉక్రెయిన్‌పై ఏకాభిప్రాయం వ్యక్తం కాకుంటే సంయుక్త ప్రకటన లేకుండానే శిఖరాగ్ర సదస్సును ముగించాల్సి వచ్చేది. ఈ కూటమి చరిత్రలో అలాంటి పరిణామం ఎన్నడూ చోటుచేసుకోలేదు. తాజాగా భారత దౌత్యం ఫలించి సభ్యదేశాలు ఏకతాటిపైకి వచ్చాయి. 37 పేజీల డిక్లరేషన్‌లో ప్రస్తావించిన అంశాలివీ..

దీర్ఘకాల శాంతికి చర్యలు అవసరం

అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అన్ని దేశాలూ కట్టుబడాలి. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. ఉక్రెయిన్‌లో న్యాయబద్ధమైన, దీర్ఘకాల శాంతికి చర్యలు అవసరం. ఐరాస నిబంధనలను గౌరవించాలి. అణ్వాయుధాలను ప్రయోగిస్తామని బెదిరించడం సరికాదు. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తూ దురాక్రమణలకు పాల్పడకూడదు. ఆహార, ఇంధన భద్రత ప్రాముఖ్యత గుర్తించి.. సైనిక విధ్వంసాన్ని, సంబంధిత మౌలిక వసతులపై దాడులను నిలిపివేయాలి. అంతర్జాతీయ మానవత్వ చట్టాలకు కట్టుబడాలి. సంక్షోభాలు, ఘర్షణలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై యుద్ధం వల్ల పడే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే అంశంలో మేం కలిసికట్టుగా ఉన్నాం. ‘ఒక పుడమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్‌’ నినాద స్ఫూర్తికి అనుగుణంగా దేశాల మధ్య శాంతియుత, స్నేహ సంబంధాలను మెరుగుపరచుకోవాలి. ఉక్రెయిన్‌లో దీర్ఘకాల శాంతికి చేపట్టే నిర్మాణాత్మక చర్యలను స్వాగతిస్తాం. ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంతర్జాతీయ ఆహార, ఇంధన భద్రత, సరఫరా వ్యవస్థలు, ఆర్థిక సుస్థిరత, ద్రవ్యోల్బణం, వృద్ధిపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా.. కొవిడ్‌-19 మహమ్మారి నుంచి కోలుకుంటున్న వర్ధమాన, పేద దేశాలకు అది శరాఘాతం. ఈ యుద్ధంపై భిన్నాభిప్రాయాలు, అంచనాలు ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ నుంచి ధాన్యం, ఆహార పదార్థాలు, ఎరువులు, ఇతర ముడి పదార్థాలను ఎటువంటి అడ్డంకులు లేకుండా సరఫరా చేయాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఆఫ్రికాలోని పేద దేశాల అవసరాలు తీర్చుకోవడానికి ఇది అవసరం.

ఉగ్రవాదంపై..

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది ఆమోదయోగ్యం కాదు. ముష్కరులకు సురక్షిత ఆవాసాలు, స్వేచ్ఛ, ఆర్థిక, వస్తు తోడ్పాటు, రాజకీయ మద్దతు లభించకుండా అంతర్జాతీయ సహకారం మరింత బలపడాలి. ఏ ఉద్దేశంతో ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డా అది సమర్థనీయం కావు. ఉగ్ర నిధులపై కన్నేసి ఉంచే ఆర్థిక చర్యల కార్యదళానికి (ఎఫ్‌ఏటీఎఫ్‌) వనరులను పెంచాలి. చిన్నపాటి ఆయుధాల అక్రమ రవాణా కట్టడికీ అంతర్జాతీయ సహకారం అవసరం.

వాతావరణం.. భూతాపం..

భూతాపాన్ని కట్టడి చేయడానికి పారిస్‌ ఒప్పందంలో పేర్కొన్న లక్ష్యాలను సాధించేందుకు నిర్దేశించుకున్న ప్రపంచ హామీలు, వాటిని అమలు చేస్తున్న తీరు సరిపోదు. ఉద్గారాల తగ్గింపునకు దేశాలు ఇచ్చిన హామీలను.. పారిస్‌ ఒప్పంద లక్ష్యాలకు అనుగుణంగా దేశాలు మార్చుకోవాలి. 2050 నాటికి నెట్‌జీరో ఉద్గారాలను సాధించడానికి, 2030 నాటికి శుద్ధ ఇంధన పరిజ్ఞానాలను సాధించడానికి వర్ధమాన దేశాలకు లక్షల కోట్ల డాలర్లు అవసరం. వాతావరణ మార్పుల ప్రభావం మహిళలు, బాలికలపై ఎక్కువగా పడుతోంది. అందువల్ల వాతావరణ కార్యాచరణను వేగవంతం చేయాలి. అందులో మహిళా భాగస్వామ్యాన్ని పెంచాలి.

  • విచ్చలవిడిగా బొగ్గు వినియోగాన్ని దశలవారీగా తగ్గించడానికి కట్టుబడి ఉన్నాం. శిలాజ ఇంధన రాయితీల ఉపసంహరణ, హేతుబద్ధీకరణకు 2009లో పిట్స్‌బర్గ్‌లో ఇచ్చిన హామీకి దేశాలు కట్టుబడాలి. తక్కువ ఉద్గారాలను వెలువరించే ఇంధన వ్యవస్థలను వేగంగా అభివృద్ధి చేసి, వినియోగంలోకి తీసుకురావాలి. శుద్ధ ఇంధన ఉత్పత్తిని విస్తరించాలి.

జీ20 సదస్సులో 5 కీలక విజయాలివీ...

1) జీ20 కూటమిలో ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం.

2) అమెరికా, భారత్‌, సౌదీ అరేబియా, గల్ఫ్‌, అరబ్‌ దేశాలను కలుపుతూ రైలు, నౌకాయాన అనుసంధానత కల్పన.

3) ప్రపంచ జీవ ఇంధన కూటమి ఆవిర్భావం.

4) ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పలు కీలక సమస్యలపై పోరాటానికి దిల్లీ డిక్లరేషన్‌.

5) పర్యావరణం, వాతావరణ మార్పులపై పరిశీలనకు జీ20 శాటిలైట్‌ మిషన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని