Kejriwal: జైల్లో కేజ్రీవాల్‌కు వేధింపులు.. ఆప్‌ తీవ్ర ఆరోపణలు

జైల్లో ఉన్న దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను  మోదీ సర్కార్‌ హింసకు గురి చేస్తోందని ఆప్‌ ఆరోపించింది.

Published : 03 Jun 2024 20:36 IST

దిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను కేంద్రంలోని భాజపా లక్ష్యంగా చేసుకొందని ఆప్‌ నేత, దిల్లీ మంత్రి అతిశీ (Atishi) ఆరోపించారు. జైల్లో ఆయనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. కేజ్రీవాల్‌ ఆరోగ్యం క్షీణించేందుకు మోదీ సర్కారే కారణమని ఆరోపించారు.

‘‘జైల్లో కేజ్రీవాల్‌ హింసకు గురవుతున్నారు. ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు జైలు సిబ్బందితో కలిసి మోదీ సర్కార్‌ కుట్ర పన్నుతోంది. దిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. కేజ్రీవాల్‌ ఉన్న సెల్‌లో కనీసం కూలర్‌ను కూడా ఏర్పాటు చేయలేదు. ఆయన ఆరోగ్యంతో భాజపా చెలగాటమాడుతోంది. మీరు (మోదీ సర్కారును ఉద్దేశిస్తూ) ఇంకెంతగా దిగజారుతారో అర్థం కావడం లేదు. మీ కోపానికి హద్దులనేవే లేవా?’’ అని అతిశీ ప్రశ్నించారు.

మోదీ సర్కార్‌ డ్రామాలు చేస్తోంది

‘‘కేజ్రీవాల్‌ జైలుకు వెళ్లాక బరువు తగ్గారు. ముందుగా రికార్డు చేసిన బరువును తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జైలుకు వెళ్లడానికి ముందు సీఎం 61 కేజీల బరువున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆయన మరో మూడు కేజీలు బరువు పెరిగినట్లు చూపించారు. మరోసారి 66 కేజీలకు పైగా ఉన్నట్లు అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. మధ్యంతర బెయిల్‌పై వచ్చినప్పుడు మునుపటికంటే 7 కిలోలు తగ్గారు. కేజ్రీవాల్‌ ఆరోగ్యం విషయంలో కేంద్రం డ్రామాలు చేస్తోంది’’ అని మంత్రి నిప్పులు చెరిగారు.

లక్షద్వీప్‌ వెళ్లండి: మాల్దీవుల నిషేధం వేళ ఇజ్రాయెల్ ఎంబసీ పోస్టు

తమ ప్రియతమ నాయకుడి పట్ల ఇలా ప్రవర్తించడాన్ని దిల్లీ ప్రజలు సహించలేరని అతీశీ పేర్కొన్నారు. భాజపా చర్యలను ఎన్నటికీ మరచిపోలేరని అన్నారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్‌ గడువు పొడిగించాలని కేజ్రీవాల్‌ అభ్యర్థనపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. గడువు ముగియడంతో ఆయన తిరిగి జూన్‌ 2న జైలులో లొంగిపోయారు. ఈ నేపథ్యంలో స్పందించిన అతిశీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని