Basava Nadu: కర్ణాటకను ‘బసవనాడు’గా మారిస్తే తప్పేంటి?: మంత్రి ఎంబీ పాటిల్‌

కర్ణాటక పేరును బసవనాడుగా మారిస్తే తప్పేముందని.. ఎంతోమంది ఇదే డిమాండు చేస్తున్నారని కర్ణాటక భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌ పేర్కొన్నారు.

Published : 28 Oct 2023 01:47 IST

బెంగళూరు: కర్ణాటకలో పలు జిల్లాల పేర్లు (District Names) మార్పు అంశం చర్చనీయాంశమవుతోంది. రామనగర జిల్లాను బెంగళూరు సౌత్‌గా మార్చాలని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ప్రతిపాదన చేసిన మరుసటి రోజే మరో జిల్లా పేరు మార్పు డిమాండు మొదలయ్యింది. ‘విజయపుర’ జిల్లా పేరును ‘బసవేశ్వర’గా మార్చాలంటూ ఆ రాష్ట్ర మంత్రి ఎంబీ పాటిల్‌ డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా కర్ణాటక రాష్ట్రాన్ని ‘బసవనాడు’ (Basava Nadu)గా మార్చడంలోనూ ఎటువంటి తప్పూ లేదని స్పష్టం చేశారు.

‘హోయసల కాలంలో ఈ ప్రాంతాన్ని విజయపురగా పిలిచేవారు. తర్వాత అదిల్‌ షాహీ పాలనా కాలంలో దీన్ని బీజాపుర్‌గా మార్చారు. అనంతరం ఇది విజయపురగా మారింది. ప్రస్తుతం ఈ పేరును బసవేశ్వర జిల్లాగా మార్చాలని ఎంతోమంది ప్రజలు డిమాండు చేస్తున్నారు. బసవన్న జన్మస్థలమైన ఈ ప్రాంతం పేరును మార్చడంలో ఎటువంటి తప్పూ లేదు’ అని కర్ణాటక భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌ పేర్కొన్నారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన.. పేర్ల మార్పునకు కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ, వీటిపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని అన్నారు.

ఆ జిల్లా పేరు మారిస్తే ఆమరణ దీక్ష చేస్తా : హెచ్‌డీ కుమారస్వామి

కర్ణాటక పేరును బసవనాడుగా మార్చడంపై మీ అభిప్రాయమేంటని విలేకరులు అడగగా.. ‘అది సహజమే. అందులో తప్పేముంది? ప్రపంచంలో తొలి పార్లమెంటు ‘అనుభవ మంటపాన్ని’ అందించింది బసవన్న. సామాజిక భావనను అందించారు. మన ప్రాంతాన్ని బసవనాడుగా మార్చాలని చెబుతూనే ఉన్నాం. బసవ సంస్కృతిని మనం అలవరచుకోవాలి’ అని మంత్రి పాటిల్‌ పేర్కొన్నారు. నగరంలోని మెట్రో, విజయపుర్‌ ఎయిర్‌పోర్టులకు ఆయన పేరే పెట్టాలని.. వీటిపై సీఎంతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇదిలా ఉంటే, కర్ణాటకలో 12 నగరాల పేర్లను మార్చేందుకు 2014లో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో బెంగళూర్‌ (Bangalore) బెంగళూరు (Bengaluru)గా, బీజాపుర్‌ విజయపురగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని