Modi: కన్యాకుమారి పర్యటన వేళ.. 30 ఏళ్ల నాటి మోదీ చిత్రం వైరల్‌

స్వామి వివేకానంద స్మారకం వద్ద ప్రధాని మోదీ(PM Modi) ధ్యానం చేయనున్న వేళ.. ఆయనకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

Published : 30 May 2024 18:03 IST

దిల్లీ: నేటితో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాని మోదీ(Modi) తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకున్నారు. స్వామి వివేకానంద స్మారకం వద్ద ఆయన కొన్ని గంటల పాటు ధ్యానం చేయనున్నారు. ఈ సమయంలో మోదీకి చెందిన ఒక చిత్రం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. 32 ఏళ్ల క్రితం ఈ ప్రఖ్యాత స్థలం వద్ద ఆయన పర్యటించినప్పటి దృశ్యమది.

డిసెంబర్ 11, 1991లో భాజపా ఏక్తా యాత్ర (యూనిటీ మార్చ్‌)ను నిర్వహించింది. కన్యాకుమారిలోని వివేకానంద రాక్‌ మెమోరియల్ నుంచి దానిని ప్రారంభించింది. అప్పుడు ఆ పార్టీ నేతలు వివేకానందుడి విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. యాత్రకు నాయకత్వం వహించిన మురళీమనోహర్ జోషితో పాటు నరేంద్రమోదీ కూడా ఆ చిత్రంలో కనిపిస్తున్నారు. డిసెంబర్ 11న ప్రారంభమైన ఆ మార్చ్‌ 14 రాష్ట్రాల మీదుగా ప్రయాణించి కశ్మీర్‌లో ముగిసింది. 1992, జనవరి 26 శ్రీనగర్‌లో జాతీయజెండా ఎగరవేసి, దానికి ముగింపు పలికారు. ఈ మొత్తం ప్రక్రియ దిగ్విజయంగా సాగడంలో మోదీ తనవంతు పాత్ర పోషించారు. ఉగ్రవాద శక్తులకు వ్యతిరేకంగా భారత్‌ దృఢంగా, ఐక్యంగా నిల్చుంటుందని ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతో అప్పట్లో దానిని నిర్వహించారు.

నాడు కేదార్‌నాథ్‌.. నేడు కన్యాకుమారి: ప్రధాని ధ్యాన సాధనకు వేదిక

ఇదిలాఉంటే.. మూడు దశాబ్దాల తర్వాత, సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగింపురోజున మోదీ మరోసారి అక్కడికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది కన్యాకుమారి నుంచి 500 మీటర్ల దూరంలో సముద్రం మధ్యలో ఉంటుంది. ఇక్కడ బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలుస్తాయి. 1892లో స్వామి వివేకానందా ఇక్కడే మూడు పగళ్లు, మూడు రాత్రులు ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించారని భక్తులు నమ్ముతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలాఉంటే.. 2019లో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా మోదీ కేదార్‌నాథ్‌ వద్ద గుహల్లో ధ్యానం చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు