Amit Shah: దేశానికి ఇద్దరు ప్రధానులు ఎలా ఉంటారు? విపక్షాలపై అమిత్ షా ధ్వజం

Amit Shah: ‘ఒకే జెండా, ఒకే ప్రధాని, ఒకే రాజ్యాంగం’ అనేది రాజకీయ నినాదం అంటూ ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టిగా బదులిచ్చారు. అది రాజకీయ నినాదం కాదని అన్నారు. దేశానికి ఇద్దరు ప్రధానులు ఎలా ఉంటారని విపక్షాలను ప్రశ్నించారు.

Published : 05 Dec 2023 18:03 IST

దిల్లీ: పార్లమెంట్‌ (Parliament) శీతాకాల సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir) రిజర్వేషన్‌ (సవరణ) బిల్లు, జమ్మూకశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ (సవరణ) బిల్లుపై లోక్‌సభ (Lok sabha)లో మంగళవారం చర్చ జరిగింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా టీఎంసీ (TMC) ఎంపీ సౌగతా రాయ్‌ (Saugata Roy) మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. గతంలో జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టి హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఏం సాధించారని నిలదీశారు.

‘‘అక్కడ శాసనసభే లేనప్పుడు.. ఈ సవరణ బిల్లులు పెట్టి ప్రయోజనం ఏంటీ? ముందు శాసనసభను ఏర్పాటు చేసి ఆ తర్వాత సవరణలు చేయండి. మీ వేగాన్ని జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంలో చూపించండి. ‘ఒకే ప్రధాని, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం’ అని భాజపా ఇచ్చిన హామీని నెరవేర్చేందుకే ఆర్టికల్‌ 370ని రద్దు చేశారు. ఈ నినాదాన్ని శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ ఇచ్చారు. అయితే, ఇది జమ్మూకశ్మీర్‌ ప్రజలకు కాదు. అది కేవలం రాజ్యాంగ నినాదం మాత్రమే’’ అని సౌగతా రాయ్‌ వ్యాఖ్యానించారు.

‘70ఏళ్లుగా ఉన్న అలవాటు.. తేలిగ్గా వదులుకోరు’.. కాంగ్రెస్‌పై ‘ఎమోజీల’తో మోదీ పోస్ట్‌ వైరల్‌

దీనికి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ‘‘రాయ్‌ వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఒక దేశానికి ఇద్దరు ప్రధానులు, రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు ఎలా ఉంటాయి? గతంలో కొందరు (కాంగ్రెస్‌ పాలనను ఉద్దేశిస్తూ) ఈ తప్పే చేశారు. దాన్నే ప్రధాని మోదీ సరిదిద్దారు. ‘ఒకే ప్రధాని, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం’ అనేది రాజకీయ నినాదం కాదు. 1950ల నుంచే మనం ‘ఏక్‌ ప్రధాన్‌, ఏక్‌ నిషాన్‌, ఏక్‌ విధాన్‌’ ఉండాలని చెబుతున్నాం. దాన్నే మా ప్రభుత్వం అమలు చేసింది’’ అని హోంమంత్రి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని