MPs suspension: ‘సస్పెన్షన్‌’ కోసం విపక్ష ఎంపీలే విజ్ఞప్తి చేశారు : కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి

కొంతమంది ఎంపీలను సస్పెండ్‌ చేసిన తర్వాత.. వారి సహచర సభ్యులు సస్పెన్షన్‌ కోరుతూ తమని అభ్యర్థించారని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు.

Updated : 22 Dec 2023 15:58 IST

దిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో (Parliament Winter Session) సభా కార్యకలాపాలు సజావుగా సాగకుండా విపక్ష పార్టీలు అడ్డుకున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి విమర్శించారు. ఎంపీలను సస్పెండ్‌ చేయడం (MPs suspension) తమ ప్రభుత్వానికి ఇష్టం లేదని.. కానీ, పలువురు ఎంపీల సస్పెన్షన్‌ తర్వాత.. తమపైనా చర్యలు తీసుకోవాలని మరికొందరు విపక్ష సభ్యులు అభ్యర్థించారని పేర్కొన్నారు. పార్లమెంటు (Parliament) ఉభయసభల ఆమోదం పొందిన మూడు బిల్లులపై ఏమైనా అభ్యంతరాలుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించే స్వేచ్ఛ విపక్ష పార్టీలకు ఉందన్నారు.

‘భారత్‌ను చైనాతో పోల్చొద్దు..!’ మోదీ కీలక వ్యాఖ్యలు

‘ఎంపీలను సస్పెండ్‌ చేయాలని మేము కోరుకోలేదు. కానీ, కొంతమంది ఎంపీలను సస్పెండ్‌ చేసిన తర్వాత.. వారి సహచర సభ్యులు తమను కూడా సస్పెండ్‌ చేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్‌ ఈ స్థాయికి దిగజారింది’ అని ప్రహ్లాద్‌ జోషి విమర్శించారు. దిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. సభలోకి ప్లకార్డులను తీసుకొచ్చే వారిపై చర్యలుంటాయని ఎంపీలకు ముందే చెప్పామన్నారు.

భాజపా ఎంపీ స్టేట్‌మెంట్‌ రికార్డు..

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపైనా ప్రహ్లాద్‌ జోషి విరుచుకుపడ్డారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను అపహాస్యం చేస్తుంటే.. అటువంటి చర్యలను కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు (రాహుల్‌ గాంధీ) తన ఫోన్లో బంధిస్తూ ఎంజాయ్‌ చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండదని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అదేవిధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై దర్యాప్తు కొనసాగుతోందని, నివేదిక వచ్చిన తర్వాత చట్టం తన పని చేసుకుపోతుందన్నారు. దర్యాప్తులో భాగంగా భాజపా ఎంపీ ప్రతాప్‌ సింహ వాంగ్మూలాన్నీ రికార్డు చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని