మూకుమ్మడి సస్పెన్షన్లు.. పార్లమెంట్ నుంచి విపక్ష ఎంపీల నిరసన ర్యాలీ

పార్లమెంట్‌(Parliament)లో విపక్ష ఎంపీలపై గత కొన్ని రోజులుగా సస్పెన్షన్ వేటు పడుతోంది. దీనికి నిరసనగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ర్యాలీ (protest march) చేపట్టారు. 

Updated : 21 Dec 2023 14:05 IST

దిల్లీ: ప్రస్తుతం జరుగుతోన్న పార్లమెంట్ (Parliament) సెషన్‌లో 143 మంది విపక్ష ఎంపీలపై వేటుపడిన సంగతి తెలిసిందే. ఈ మూకుమ్మడి సస్పెన్షన్లపై గురువారం ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నిరసన ర్యాలీ (protest march) చేపట్టారు. పార్లమెంట్ (Parliament) భవనం నుంచి సెంట్రల్‌ దిల్లీలోని విజయ్ చౌక్(Vijay Chowk) వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాసిన బ్యానర్‌, ప్లకార్డులను ప్రదర్శించారు. 

ఈ ర్యాలీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముందుండి నడిపించారు. అధికార భాజపాకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని ఆయన విమర్శించారు. ‘‘భద్రతా వైఫల్యంపై చర్చించడానికి అనుమతి ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ ఛైర్మన్‌ను కోరుతున్నాం. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా దీనిపై పార్లమెంట్‌లో ప్రకటన చేయాలి. ప్రధాని లోక్‌సభ మినహా బయట మీడియాతో, సభల్లో దీని గురించి మాట్లాడారు. భద్రతా వైఫల్యం ఘటన ఎందుకు జరిగింది..? ఎవరు బాధ్యులు..?’’ అని ఖర్గే ప్రశ్నించారు. ‘ఇండియా’ కూటమికి చెందిన సభ్యులు శుక్రవారం జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపట్టనున్నారని ఆయన చెప్పారు.

లోక్‌సభలో భద్రతా వైఫల్యం.. అదుపులో మాజీ పోలీసు ఉన్నతాధికారి కుమారుడు

డిసెంబర్ 13న పార్లమెంట్‌లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయాలని గతవారం నుంచి విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దాంతో నాటి నుంచి వరుసగా ఉభయ సభల ఎంపీలపై సస్పెన్షన్ల వేటు పడుతోంది. ఇప్పటి వరకు ఆ సంఖ్య 143కు చేరింది. మరోవైపు బుధవారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య (బీఎస్‌).. బిల్లులకు ఆమోదం లభించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని