Security breach: లోక్‌సభలో భద్రతా వైఫల్యం.. అదుపులో మాజీ పోలీసు ఉన్నతాధికారి కుమారుడు

parliament security breach: లోక్‌సభలో భద్రతా వైఫల్యం ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా కర్ణాటకలో ఓ టెకీని అదుపులోకి తీసుకున్నారు.

Updated : 21 Dec 2023 10:39 IST

బెంగళూరు: శీతాకాల పార్లమెంట్ (Parliament) సమావేశాల వేళ లోక్‌సభ (Loksabha)లోకి ఇద్దరు దుండగులు దూసుకొచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ టెకీని దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకొన్నాయి. అతడు కర్ణాటక పోలీసు శాఖలో పనిచేసిన ఓ మాజీ ఉన్నతాధికారి కుమారుడు సాయికృష్ణ జగాలి అని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

రిటైర్డ్‌ డీఎస్పీ కుమారుడైన సాయి.. లోక్‌సభలో అలజడి సృష్టించిన మనోరంజన్‌కు స్నేహితుడు. వారిద్దరూ బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బ్యాచ్‌మెట్స్‌. విచారణలో భాగంగా మనోరంజన్‌ చెప్పిన వివరాల ఆధారంగా బుధవారం సాయంత్రం సాయికృష్ణను.. బాగల్‌కోటెలోని అతడి ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు. అతడిని దిల్లీకి తరలించి విచారించనున్నారు.

33 నేరాల్లో జైలుశిక్ష పెంపు

తాజా పరిణామాలపై సాయి సోదరి మీడియాతో మాట్లాడారు. ‘దిల్లీ పోలీసులు వచ్చి, నా సోదరుడిని ప్రశ్నించారు. మేం ఈ విచారణకు పూర్తిగా సహకరించాం. నా సోదరుడు, మనోరంజన్ ఒకే ఇంట్లో ఉండేవారు. నా సోదరుడు ఇప్పుడు ఇంటి నుంచి పనిచేస్తున్నాడు. అతడు ఎలాంటి తప్పు చేయలేదు’ అని తెలిపారు.

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితులు మనోరంజన్‌, సాగర్ శర్మ..డిసెంబర్ 13న లోక్‌సభలోకి దూసుకువచ్చి కలకలం సృష్టించారు. అమోల్‌ శిందే, నీలమ్ ఆజాద్‌.. పార్లమెంట్ వెలుపల ఆందోళన చేపట్టారు. మరో నిందితుడు లలిత్‌ ఝా.. ఈ ఘటన మొత్తానికి సూత్రధారి అని, అతడికి మహేశ్‌ కుమావత్‌ సహకరించాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని