Jammu Kashmir: ఉగ్రవాదుల్లో పాకిస్థాన్‌ మాజీ సైనికులు..!

జమ్మూ-కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు విదేశీ ఉగ్రవాదులను హతమార్చడం ద్వారా సైన్యానికి భారీ విజయం దక్కిందని లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ తెలిపారు.

Updated : 24 Nov 2023 17:36 IST

శ్రీనగర్: భారత భూభాగంలోకి విదేశీ ఉగ్రవాదుల (Foreign Terrorists)ను ప్రవేశపెట్టేందుకు పాకిస్థాన్‌ (Pakistan) యత్నిస్తోందని నార్తర్న్‌ కమాండ్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ ఆరోపించారు. ఈ ఉగ్రవాదుల్లో ఆ దేశ మాజీ సైనికులూ ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. రాజౌరీ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరులైన సైనికుల పార్థివదేహాలకు శుక్రవారం ఆయన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు విదేశీ ఉగ్రవాదులను హతమార్చడం ద్వారా సైన్యానికి భారీ విజయం దక్కిందన్నారు. దీంతో ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు పాకిస్థాన్ చేస్తోన్న ప్రణాళికలకు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యిందని చెప్పారు.

‘పాకిస్థాన్‌కు కశ్మీర్‌లోని స్థానికుల నుంచి, ముఖ్యంగా యువత నుంచి మద్దతు కరవైంది. దీంతో విదేశీ ఉగ్రవాదులను ప్రవేశపెట్టేందుకు యత్నిస్తోంది. సరిహద్దు ప్రాంతమైన రాజౌరీ- పూంచ్‌ బెల్ట్‌లో దాదాపు 20 నుంచి 25 మంది విదేశీ ఉగ్రవాదులు ఉండొచ్చు. ఏడాదిలోపు వారిని నిర్మూలిస్తాం’ అని లెఫ్టినెంట్‌ జనరల్‌ ద్వివేదీ వెల్లడించారు. ఈ ఉగ్రవాదులను గుర్తించేందుకు యత్నించినప్పుడు.. వారిలో కొందరు పాక్‌ రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది ఉన్నట్లు తెలిసిందన్నారు. సార్వత్రిక ఎన్నికలకు అంతరాయం కలిగించేందుకు రాబోయే నెలల్లో పాకిస్థాన్‌ మరింత మంది ఉగ్రవాదులను పంపిస్తుందా? అని ప్రశ్నకు.. అవుననే చెప్పారు. అయితే, పూర్తి వివరాలు వెల్లడించలేదు.

సైన్యం ప్రాణ త్యాగాలు గణాంకాలుగానే మిగిలిపోకూడదు: ఆనంద్‌ మహీంద్రా

‘తాజా ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులు.. స్థానికంగా ఉగ్ర కార్యకలాపాలకు ఒక వేదికను నిర్మించారు. ఏడాది కాలంగా ఇక్కడ చురుగ్గా ఉన్నారు. వారికి ఎవరో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, సమాచారాన్ని చేరవేశారు. ఈ ఇద్దరు.. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ తదితర దేశాల్లో శిక్షణ పొందారు! స్థానికంగా 10 పౌర హత్యలతోపాటు ఐదుగురు భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోయిన కాండీ ఘటనలో వీరి ప్రమేయం ఉంది. ఈ క్రమంలోనే మన వీర సైనికులు వారిని మట్టుబెట్టారు. ఈ ఉగ్రవాదుల మరణం.. ఈ ప్రాంతాన్ని కలవరపెట్టాలని భావిస్తోన్న పాక్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది’ అని లెఫ్టినెంట్‌ జనరల్‌ ద్వివేదీ అన్నారు.

‘దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశాడు..’

రాజౌరీ ఎన్‌కౌంటర్‌లో అమరుడైన బిష్త్‌తో తన ఇటీవలి భేటీని లెఫ్టినెంట్‌ జనరల్‌ ద్వివేదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ‘నేనే అతడికి ఒక ప్రశంసాపత్రాన్ని అందించాను. భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావు? అని అడిగాను. వారం రోజుల్లో ఏదైనా గొప్పగా సాధిస్తానని చెప్పాడు. అతడు దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు’ అని తెలిపారు. లష్కరే తోయిబా అగ్ర కమాండర్‌ క్వారీని అంతమొందించడం.. భయంతో జీవిస్తున్న స్థానికులకు మనోధైర్యాన్ని అందిస్తుందన్నారు. ఇక్కడి పౌరులు సైన్యానికి మద్దతు ఇవ్వడం వల్లనే ఈ విజయం సాధ్యమైనట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని