Parliament Security Breach: తొలుత తమకు తాము నిప్పంటించుకోవాలనుకున్నారట..!

లోక్‌సభలో అలజడి ఘటనలో నిందితులు తొలుత తమకు తాము నిప్పంటించుకోవడం వంటి ప్రణాళికలూ రూపొందించినట్లు పోలీసులు వెల్లడించారు.

Updated : 16 Dec 2023 14:06 IST

దిల్లీ: పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటన (Parliament Security Breach Case)లో నిందితులు తొలుత తమకు తాము నిప్పంటించుకోవడం, కరపత్రాలను విసిరేయడం వంటి ప్రణాళికలూ రూపొందించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. చివరకు ఆ ప్రయత్నాలను విరమించి, బుధవారం అమలు చేసిన ప్లాన్‌తో ముందుకెళ్లినట్లు తెలిపారు. విచారణలో భాగంగా నిందితులు ఈ వివరాలు వెల్లడించినట్లు చెప్పారు. మరోవైపు.. ఈ కేసులో ఇద్దరు నిందితులకు విజిటర్ పాసులు జారీ చేసిన భాజపా ఎంపీ ప్రతాప్ సింహా వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేయాలని యోచిస్తోన్నట్లు సమాచారం.

‘‘లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకే ప్రణాళికను ఖరారు చేయడానికి ముందు నిందితులు ప్రభుత్వానికి తమ సందేశాన్ని బలంగా పంపేందుకు ఇతర మార్గాలనూ అన్వేషించారు. తమ ఒంటికి ఫైర్‌ప్రూఫ్‌ జెల్‌ పూసుకుని.. తమకు తాము నిప్పంటించుకునే ప్లాన్‌ చేశారు. పార్లమెంటు లోపల కరపత్రాలను విసరాలని కూడా భావించారు. కానీ, చివరకు బుధవారం నాటి ప్రణాళిక (లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకడం) అమలు చేశారు’’ అని ఓ పోలీసు అధికారి ‘పీటీఐ’కి చెప్పారు.

అరాచకం సృష్టించాలని కుట్ర

మరోవైపు.. దర్యాప్తులో భాగంగా అధికారులు శుక్రవారం అర్ధరాత్రి నిందితులను.. గతంలో వారు కలిసిన, ఈ కుట్రకు ప్లాన్‌ చేసిన ప్రాంతాలకు తీసుకెళ్లారు. ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న లలిత్‌ ఝాను త్వరలో రాజస్థాన్‌లోని నాగౌర్‌కు తీసుకెళ్లనున్నారు. పార్లమెంటులో ఘటనల అనంతరం దిల్లీ నుంచి రాజస్థాన్‌కు పారిపోయిన అతడు.. గురువారం రాత్రి పోలీసుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. సాక్ష్యాధారాలను నాశనం చేసే ప్రయత్నంలో భాగంగా తన ఫోన్‌ను పారేసిన, ఇతరుల ఫోన్లను కాల్చేసిన ప్రాంతాలకు అతడిని తీసుకెళ్లనున్నారు. పార్లమెంట్‌లోనూ ‘సీన్‌ రీక్రియేషన్‌’ చేయనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని